జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ విలీనం

– మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని సివిల్‌ ఏరియాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. దీనిపై ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా రక్షణశాఖ మంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. ఈ ఏడాది మార్చి 5వ తేదీన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కూడా స్వయంగా కలిసి ఈ అంశంపై విజ్ఞప్తి చేశారు.
అయితే అంతకుముందే బ్రిటీష్‌ కాలం నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్న కంటోన్మెంట్‌ బోర్డులన్నింటినీ రద్దు చేసి, మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతూ రాస్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇటీవలే కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాశారు. ఈనెల 25 కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ఈ విలీన ప్రక్రియపై ఆమె స్పష్టమైన వైఖరిని వినిపించారు. ఈ సమావేశం మినట్స్‌కు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. విధివిధానాలను ఖరారు చేసింది. దీనితో కంటోన్మెంట్‌లోని సివిల్‌ ఏరియాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తారు. అక్కడి ప్రజలకు నిర్దేశించిన సౌకర్యాలు, మౌలిక వసతులన్నింటినీ ఉచితంగా జీహెచ్‌ఎంసీకి బదిలీ చేస్తారు. కంటోన్మెంట్‌ బోర్డుల ఆస్తులు, అప్పులన్నీ మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. అక్కడ ఇప్పటికే ఇచ్చిన లీజులు కూడా మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. మిలిటరీ స్టేషన్‌ మినహా కంటోన్మెంట్‌లోని నివాస ప్రాంతాలకు జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరిస్తుంది. పన్నులు విధిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కుతాయి. ఆయా ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ దళాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంటోన్మెంట్‌ బోర్డు బాధ్యుల సందేహాలను నివృత్తి చేసి, తదుపరి కార్యాచరణ చేపట్టాలని సూచించింది.

Spread the love