– నగర శివారు మున్సిపాలిటీలపై సందిగ్ధం
– ఈ నెలాఖరుతో ముగియనున్న పాలకవర్గాల గడువు
– జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తారంటూ ప్రచారం
– ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్వత్రా ఉత్కంఠ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరానికి శివారులో ఉన్న మున్సిపాల్టీలపై సందిగ్ధం నెలకొంది. వీటిని గ్రేటర్‌లో కలుపుతారా..? లేదంటే మున్సిపాల్టీలుగానే ఉంచుతారా..? అన్న దానిపై నగరంలో జోరుగా చర్చ జరుగుతోంది. రింగ్ రోడ్డు లోపలి భాగమంతా కోర్ కార్బన్ ఏరియా, రీజినల్ రింగు రోడ్డు వరకు సెమీ అర్బన్ అంటూ గతంలో ప్రభుత్వం ప్రకటించడంతో ఈ గందరగోళం నెలకొన్నది. సరిగ్గా ఇదే సమయంలో నగర శివారులో ఉన్న పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల గడువు సైతం ఈ నెలాఖరుతో ముగుస్తుండటంతో వాటికి ఎన్నికలు నిర్వహించడంపై సందేహాలు నెలకొన్నాయి. శివారు మున్సిపాల్టీలను గ్రేటర్‌లో కలిపితే ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో ఉన్న 150 డివిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే గ్రేటర్‌ను రెండు, మూడు జోన్‌లుగా విభజించాలని గతంలో ప్రభుత్వం ఆలోచన చేసింది. గ్రేటర్‌లో మున్సిపాలిటీలను, నగర కార్పొరేషన్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తే రాజకీయంగా అధికారపార్టీకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం ఉంది. దీంతోనే ప్రభుత్వం వెనక్కు తగ్గినట్టు వార్తలు వినిపిస్తున్నా.. భవిష్యత్తులో ఏమీ జరుగుతుందనే దానిపై ద్వితీయశ్రేణి నేతలు చర్చోపచర్చలు సాగిస్తున్నారు.
మున్సిపాల్టీల్లో జీపీలు విలీనం
ఇటీవల నగర శివారులో ఉన్న 52 గ్రామ పంచాయతీలను (251 వార్డులు) సమీప 14 మున్సిపాల్టీల్లో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మున్సిపాల్టీల విస్తీర్ణం, జనాభా పెరిగింది. ఆ గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుండగా, ఇటీవలే మున్సిపల్ కమిషనర్ల ఆధీనంలోకి ఆ గ్రామ పంచాయతీలు వెళ్లాయి. జీపీలను విలీనం చేసిన మున్సిపాల్టీల్లో పెద్ద అంబర్‌పేట, శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, తెల్లాపూర్, అమీన్‌పూర్ ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీల అన్ని రికార్డులను ఇప్పటికే మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాల్టీల పాలక మండలి గడువు ఈ నెలాఖరులో ముగియనున్నది. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తయ్యాక మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. సిటీ శివారు ప్రాంతంలో ఉన్న నిజాంపేట్, బడంగ్‌పేట్, మీర్‌పేట, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్ తదితర పలు మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు పెద్ద అంబర్‌పేట, తుర్క యంజాల్, మణికొండ, నార్నింగి, ఆదిభట్ల, శంకర్‌పల్లి, తుక్కుగూడ, దమ్మాయిగూడ, నాగారం, తూంకుంట, కొంపల్లి, అమీన్‌పూర్, మేడ్చల్, పోచారం, ఘట్‌కేసర్, గుండ్ల పోచంపల్లి తదితర పలు మున్సిపాల్టీల ఎన్నికలపై చర్చ మొదలైంది. జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరిస్తే ఇవన్నీ అందులో భాగమవుతాయా..? లేక నగరానికి నాలుగు దిక్కులా వేర్వేరు మున్నిపల్ కార్పొరేషన్లు ఏర్పాటైతే అందులో విలీనం చేస్తారా..? అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై సంక్రాంతి తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ఈ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల గడువు తీరేలోపు ప్రభుత్వం జీహెచ్‌ఎంసీలో విలీనంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే వీటికి ఎన్నికలు నిర్వహించడమా..? లేక స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి తీసుకెళ్ళడమా..? అనేది కూడా సందిగ్ధంగానే ఉంది.
విలీనం చేయకపోతే రిజర్వేషన్ల మార్పు
నగరానికి సమీపంలో ఉన్న మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో కలిపితే గ్రేటర్‌లో డివిజన్ల సంఖ్య పెరగడంతోపాటు మున్సిపాల్టీల సంఖ్య కూడా తగ్గుతుంది. తగ్గకపోతే ఈ మున్సిపాల్టీల్లో 52 గ్రామ పంచాయతీలు విలీనమైనందున కొత్తగా మున్సిపాల్టీ పరిధి, జనాభా పెరగడంతో చైర్మెన్, కౌన్సిలర్ల రిజర్వేషన్లు మారుతాయి. దీనికి సుమారు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని అధికార పార్టీ నేతలు తెలిపారు.