కాంగ్రెస్‌లో విలీనమే సరా?

ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరలను– అంతర్మథనంలో పార్టీ శ్రేణులు
– కాంగ్రెస్‌లో ఇమడలేమన్న అనుమానాలు
– ఏ దిక్కుకు వెళ్లాల్నో తెలియని దైన్యం
– ఇన్నేండ్ల శ్రమంతా వృథానేనా?అంటూ అసహనం
– రెండు నెల్లుగా విలీన తంతు నడుస్తుందని గుసగుసలు
– షర్మిల తెలంగాణలోనా? ఆంధ్రలోనా?
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతు న్నారా?ఇందుకు ఆ పార్టీ రెండో శ్రేణి నేత లంతా సుముఖంగా ఉన్నారా? రాష్ట్రంలో అన్ని నియోజక వర్గాల్లో పోటీచేయించాలన్నా తగిన అభ్యర్ధులు దొరికే పరిస్థితి లేనప్పుడు ఆ పార్టీని నడిపించడం సాధ్యమా? షర్మిలమ్మ వన్‌మెన్‌ షోతో ఆ పార్టీ మనుగడ ఎంత కాలం ఉంటుంది? ఇత్యాది ప్రశ్నలు ఆ పార్టీ శ్రేణుల్లో వెల్లువెత్తుతున్నాయి. మరి కొందరు పార్టీని నడపడమంటే ఆశామాషి కాదు సుమీ అంటూ..వైఎస్‌ ఆశయాలు నెరవేరాలంటే.. విలీనమే కరెక్టు అంటూ కుండబద్దలు కొడుతున్నారు. మరో వైపు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. దీంతో ఆయా పార్టీల్లోని నేతలు అటునుంచి ఇటు..ఇటు నుంచి అటు దూకుతున్నారు. నిన్న వైరి వర్గంగా ఉన్నవారు..నేడు ఆలింగనాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌టీపీ దారెటు? అంటూ నెల రోజులుగా విస్తృతంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే.
పార్టీ శ్రేణుల్లో ఆందోళన..
వైఎస్‌ఆర్‌టీపీ ఏర్పాటు నుంచి ఆ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న వారూ ఉన్నారు. మధ్యతో వెళ్లిన, వచ్చిన వారూ ఉన్నారు. ముఖ్యంగా వైఎస్‌ఆర్‌ అభిమానులు కాంగ్రెస్‌ పార్టీని కాదని వైఎస్‌ఆర్‌ టీపీలో పని చేస్తున్న వారూ లేకపోలేదు. వీరంతా కాంగ్రెస్‌లో ఇమడగలరా? అంటూ పలువురు అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు.
మరి కొందరు పార్టీ నేతలైతే..’గుర్తింపు’ గురించి ఆందోళన చెందుతున్నారు.మరి కొందరైతే.. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల్లో పార్టీని ‘హస్తం’లో విలీనం చేయడం ఒక్కటే ఆమెకు దారిగా కనిపిస్తున్నదని చెబుతున్నారు. పార్టీకి సరైన కేడర్‌ లేకపోవడం, ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఓట్లు పడవని, డిపాజిట్లు గల్లంతవు తాయనే భయంతో విలీనం వైపే ఆమె మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది.
ఈ విషయంపై ఇప్పటికే కాంగ్రెస్‌ నేత కర్నాటక ఉపముఖ్యమంత్రి పార్టీ అధిష్టానంతో డీకే శివకుమార్‌తో జరిపిన చర్చలు పూర్తి కావొచ్చాయనీ, సోమవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కేవీపీ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే రూఢ చేస్తున్నాయని ప్రజల్లో చర్చ జరుగుతోంది.
షర్మిల ఎక్కడంటూ చర్చ..
పరిస్థితులు మారినప్పుడు వారు వీరవుతారు, వీరు వారవుతారన్నట్టు షర్మిల పార్టీ పరిస్థితి కనిపిస్తున్నది. విలీనమైతే షర్మిల తెలంగాణలోనా? ఆంధ్రలోనా? అంటూ ముమ్మరంగా చర్చ సాగుతోంది. ముందు విలీనమైన తర్వాత…వైఎస్‌ఆర్‌ కూతురుగా పార్టీకి ఎక్కడ అవసరముంటే అక్కడ పనిచేస్తారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది వైఎస్సాఆర్‌టీపీయేననీ, సీఎం కాబోయేది కూడా తానేనని షర్మిల పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల లీడర్లు తమకు అక్కర్లేదనీ, తామే నాయకులను సృష్టించుకుంటామని ప్రస్తావించారు.
అయితే పార్టీలోనే గుర్తింపు ఉన్న నేతలెవరూ లేకపో వడంతో కేడర్‌ క్రమంగా తగ్గుతూ వస్తున్నది. పార్టీ ఇలాగే ఉంటే ఉనికికే ప్రమాదమని భావించినందునే ఆమె కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. కర్నాటక ఫలితాలు సాకుగా అక్కడి కాంగ్రెస్‌ నేత డీకే శివ కుమార్‌తో నేరుగా భేటీ అయిందని ద్వితీయ శ్రేణి నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.
ఒంటరి పోరాటం..
తెలంగాణలో సంక్షేమ పాలన లేకుండా పోయిందని 2021 ఫిబ్రవరి 9న షర్మిల వైఎస్సాఆర్‌టీపీని స్థాపిం చారు. నాటి నుండి రెండేండ్లుగా ఒంటరిగానే పోరాడుతున్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు మొదలు, టీఎస్‌పీఎస్‌ పేపరు లీకేజీల వరకు, పాదయాత్రలు, ధర్నాలు, దీక్షలు ఇలా అనేక రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కేసులు, అరెస్టులను ఎదుర్కొంది. రాష్ట్రంలో రాజన్న రాజ్య స్థాపనే లక్ష్యంగా ప్రచారం సాగించింది. కానీ.. ఇప్పుడు ఒక్కసారిగా విలీన వార్తలు లీకులవ్వటంతో ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషించుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలన్ను కాంగ్రెస్‌ ద్వారానే సాధ్యమని ఆమె భావించి ఉంటారని ముక్తాయించుకుంటున్నారు.

Spread the love