మెస్సి దారెటు?!

– పిఎస్‌జితో ముగిసిన బంధం
– ఆఖరు మ్యాచ్‌లో ఫ్యాన్స్‌ హేళన
లియోనల్‌ మెస్సి. ప్రపంచ ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌. మైదానంలో మెస్సి మ్యాజిక్‌ చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తారు. పారిస్‌ సెయింట్‌ జర్మెన్‌ (పిఎస్‌జి) క్లబ్‌తో రెండేండ్ల బంధానికి తెరదించిన లియోనల్‌ మెస్సి పట్ల ఆ క్లబ్‌ అభిమానులు అనుచితంగా ప్రవర్తించారు. శనివారం పిఎస్‌జి తరఫున ఆఖరు మ్యాచ్‌ ఆడిన మెస్సి దురభిమానుల ఎగతాళి చవిచూసినా.. చిరునవ్వుతో మైదానాన్ని, పిఎస్‌జినీ వీడాడు.
పారిస్‌ (ఫ్రాన్స్‌)
లియోనల్‌ మెస్సి (35) పారిస్‌ సెయింట్‌ జర్మెన్‌ (పిఎస్‌జి)తో ఒప్పందానికి తెరదించాడు. రెండేండ్లు ఫ్రెంచ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో కొనసాగుతున్న లియోనల్‌ మెస్సి.. కాంట్రాక్టును మరో ఏడాది కొనసాగిస్తాడనే అంచనాలు కనిపించాయి. కానీ, గత రెండు నెలల్లో జరిగిన అనూహ్య సంఘటనలతో పిఎస్‌జితో లియోనల్‌ మెస్సి బంధానికి తెరపడింది. 35 ఏండ్ల లియోనల్‌ మెస్సి శనివారం ఫ్రెంచ్‌ లీగ్‌లో పిఎస్‌జి తరఫున ఆఖరు ఆట ఆడాడు. సొంత మైదానంలో శనివారం జరిగిన చివరి మ్యాచ్‌లో క్లర్‌మోంట్‌ చేతిలో 2-3తో పిఎస్‌జి పరాజ‌యం పాలైంది. చివరి మ్యాచ్‌లో గోల్‌ కోసం ప్రయత్నించినా.. లియోనల్‌ మెస్సి గోల్‌ కొట్టలేకపోయాడు.
చిరునవ్వుతోనే..! :
శనివారం నాటి మ్యాచ్‌ ముందు అనౌన్సర్‌ లియోనల్‌ మెస్సి పేరు ప్రకటించగానే పిఎస్‌జి దురభిమానులు పెద్ద ఎత్తున హేళన చేశారు. కాసేపటికి తన ముగ్గురు కుమారులతో కలిసి మైదానంలోకి అడుగుపెట్టిన లియోనల్‌ మెస్సి చిరునవ్వుతోనే అభిమానులను పలకరించాడు. మ్యాచ్‌ చివర్లో కిలియన్‌ ఎంబపె అందించిన పాస్‌ను గోల్‌ పోస్ట్‌లోకి పంపించటంలో లియోనల్‌ మెస్సి తడబాటుకు గురయ్యాడు. దీంతో దురభిమానుల ఎగతాళి తారాస్థాయికి చేరుకుంది. ‘ పిఎస్‌జి క్లబ్‌, అభిమానులు, పారిస్‌ నగరానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిఎస్‌జికి ఆల్‌ ది బెస్ట్‌’ అని లియోనల్‌ మెస్సి వీడ్కోలు వ్యాఖ్యలు చేశాడు. పిఎస్‌జి తరఫున రెండు సీజన్లలో 75 మ్యాచులు ఆడిన లియోనల్‌ మెస్సి.. 32 గోల్స్‌ కొట్టాడు. 35 గోల్స్‌కు అవకాశాలు సృష్టించాడు. పిఎస్‌జి తరఫున రెండేండ్లలో రెండు ఫ్రెంచ్‌ లీగ్‌ టైటిళ్లు, ఓ ఫ్రెంచ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను మెస్సి ముద్దాదాడు. నిజానికి, ఈ ఏడాది మార్చి వరకు పిఎస్‌జి, మెస్సి బంధం బాగానే కనిపించింది. ‘ పిఎస్‌జిలో చాలా కంఫర్ట్‌గా ఉన్నాను. తొలి సీజన్‌లో పరిస్థితులకు అలవాటు పడేందుకు కాస్త సమయం పట్టింది. కానీ ఈ సీజన్‌ భిన్నంగా మొదలైంది. క్లబ్‌, సిటీతో ఎంతో మైరుగైన బంధం ఏర్పడింది. ఈ సీజన్‌ను చాలా బాగా ఎంజాయ్‌ చేస్తున్నాను’ అని మెస్సి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. కానీ చాంపియన్స్‌ లీగ్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో పరాజయం.. సమీకరణాలను మార్చివేసింది.
లియోనల్‌ మెస్సి రాకతో చాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ లోటు తీర్చుకోవాలని ఎదురుచూసిన పిఎస్‌జి.. నిష్క్రమణతో నిరాశచెందింది. అర్జెంటీనా తరహాలో రైట్‌, లెఫ్ట్‌ వింగ్స్‌లో మెస్సి సరైన సహకారం పిఎస్‌జిలో లభించలేదు. ఇక ఫిఫా ప్రపంచకప్‌ విజయం అనంతరం లియోనల్‌ మెస్సి మైదానంలో రిస్క్‌ తీసుకోవటం లేదని అభిమానులు ఎగతాళి చేయటం మొదలెట్టారు. దీనికి తోడు గత నెలలో రెండు రోజుల పర్యటన నిమిత్తం లియోనల్‌ మెస్సి కుటుంబంతో కలిసి సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లగా.. పిఎస్‌జి యాజమాన్యం అత్యంత కఠినంగా వ్యవహరించింది. మెస్సిని సస్పెండ్‌ చేసి, ప్రాక్టీస్‌ సెషన్‌కు సైతం రావొద్దని ఆదేశించింది. ఈ సంఘటనతో పిఎస్‌జితో మెస్సి బంధం పూర్తిగా చెడింది. అయినా, ఆఖరు మ్యాచ్‌ అనంతరం చిరునవ్వుతోనే మెస్సి మైదానాన్ని, క్లబ్‌ను వీడాడు.
నెక్ట్స్‌ ఏంటీ?! :
లియోనల్‌ మెస్సి పిఎస్‌జితో ఆఖరు మ్యాచ్‌ ఆడేశాడు. సౌదీ అరేబియా క్లబ్‌ నుంచి మెస్సి నిరాకరించలేని ఆఫర్‌ వచ్చినట్టు సమాచారం. క్రిస్టియానో రొనాల్డోకు మించిన కాంట్రాక్టును సౌదీ క్లబ్‌ మెస్సి ముందుంచినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రీమియర్‌ లీగ్‌లో చెల్సియా, న్యూక్యాసిల్‌ యునైటెడ్‌లు మెస్సి కోసం ఆఫర్‌ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. సౌదీ క్లబ్‌ అల్‌ హిలాల్‌, ఇంటర్‌ మియామితో పాటు మెస్సి పాత క్లబ్‌ బార్సిలోనా ఎఫ్‌సీ సైతం అర్జెంటీనా సూపర్‌స్టార్‌ కోసం పరితపిస్తున్నట్టు కనిపిస్తుంది. లియోనల్‌ మెస్సి నుంచి తదుపరి గమ్యంపై ఎటువంటి ప్రకటన రాలేదు. సౌదీ క్లబ్‌ అల్‌ హిలాల్‌కు మెస్సి ఆడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. లేదంటే, మళ్లీ బార్సిలోనా ఎఫ్‌సీతోనే కెరీర్‌ను ముగించేందుకు మెస్సి మొగ్గుచూపిస్తాడేమో చూడాలి.

Spread the love