అగ్నికి మెటా ఆజ్యం

అగ్నికి మెటా ఆజ్యం– ముస్లింలపై దుష్ప్రచారం చేసే ప్రకటనలకు ఆమోదం
– విద్వేష ప్రసంగాలకూ ఓకే
– మోడీని విమర్శించే యాడ్స్‌కు మాత్రం ‘నో’
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సమయంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు మెటా పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. తద్వారా అగ్నికి ఆజ్యం పోస్తోంది. ముస్లిం మైనారిటీలు, ప్రతిపక్షాలపై దుష్ప్రచారాన్ని సాగించేందుకు కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో రూపొందించిన రాజకీయ ప్రకటనలకు మెటా గ్రీన్‌సిగల్‌ ఇస్తోంది. దేశంలో నివసిస్తున్న ముస్లింలను దూషిస్తూ తయారు చేసిన పలు ప్రకటనలు ఫేస్‌బుక్‌లో దర్శనమిచ్చాయి. ‘ఈ చీడపురుగులను తగలబెట్టండి’, ‘హిందువుల రక్తం చిందుతోంది. ఈ చొరబాటుదారులను తగలబెట్టాలి’ వంటి రెచ్చగొట్టే ప్రకటనలను సైతం ఫేస్‌బుక్‌ ఆమోదించడం గమనార్హం.
హిందూ మతోన్మాద భావజాలంతో ప్రతిపక్ష నేతలపై దుష్ప్రచారం చేయడం, ఇతర సందేశాలు పంపడం వంటివి కూడా ఫేస్‌బుక్‌లో కన్పించాయి.
దేశంలో హిందువులు అనే వారు లేకుండా చేయాలని ప్రతిపక్ష నేత ఒకరు చెప్పినట్లు తప్పుడు వార్త ప్రచారంలోకి వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఓ ప్రకటన వచ్చింది. ఆ నేతను ఉరితీయాలంటూ అందులో డిమాండ్‌ చేశారు. ఈ ప్రకటనలో సందేశం పక్కనే పాకిస్తాన్‌ జాతీయ పతాకాన్ని చూపించారు.
ఆ విధానాలు వారికి వర్తించవా?
మోడీకి వ్యతిరేకంగా వచ్చిన ప్రకటన సహా మొత్తం ఐదు రాజకీయ ప్రకటనలను మెటా తిరస్కరించింది. విద్వేష ప్రసంగాలకు సంబంధించి మెటా విధానాలను ఈ ప్రకటనలు ఉల్లంఘించాయని తెలిపింది. అయితే అదే సమయంలో మెటా విధానాలను బాహాటంగా ఉల్లంఘిస్తూ, ముస్లింలను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన 14 ప్రకటనలకు ఆమోదం లభించడం గమనార్హం. బీజేపీ కర్నాటక రాష్ట్ర శాఖ షేర్‌ చేసిన యానిమేటెడ్‌ వీడియోను ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసిన తర్వాతే సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’ తొలగించిన సంగతి తెలిసిందే.
నివేదిక ఏం చెప్పింది?
ఇండియా సివిల్‌ వాచ్‌ ఇంటర్నేషనల్‌ (ఐసీడబ్ల్యూఐ), కార్పొరేట్‌ జవాబుదారీ సంస్థ ఎకో సంయుక్తంగా ఓ నివేదికను రూపొందించి మెటా యాడ్‌ లైబ్రరీకి అందజేశాయి. ఈ నెల 8-13 తేదీల మధ్య… అంటే లోక్‌సభ ఎన్నికల మూడవ, నాలుగవ దశల పోలింగ్‌ మధ్య వచ్చిన ప్రకటనలను ఈ సంస్థలు పరిశీలించాయి. ఈ ప్రకటనల్లో ఉన్న ప్రమాదకరమైన రాజకీయ అంశాలను గుర్తించి తొలగించాల్సిందిగా కంపెనీ యంత్రాంగాన్ని కోరాయి.
దేశంలో జరుగుతున్న విద్వేష ప్రసంగాలు, దుష్ప్రచారాలను ఆధారంగా చేసుకొని ఈ ప్రకటనలను రూపొందించారని నివేదిక ఎత్తిచూపింది. ఆంగ్లం, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ భాషల్లో ఉన్న 22 ప్రకటనలను పరిశోధకులు మెటాకు అందజేశారు. అయితే ఆశ్చర్యకరంగా వాటిలో 14 ప్రకటనలకు 24 గంటల వ్యవధిలోనే మెటా ఆమోదం తెలిపింది. మరో మూడింటిని చిన్న చిన్న ట్వీక్స్‌ ఆమోదించాయి. కాగా ఆ ప్రకటనలు ప్రచురితం కాకుండా పరిశోధకులు వెంటనే తొలగించారు. ఆమోదించిన ప్రకటనల్లో ఏఐ సాయంతో వక్రీకరించిన చిత్రాలే ఉన్నాయన్న విషయాన్ని గుర్తించడంలో మెటా విఫలమైందని వారు తేల్చారు.
మెటాపై ఎకో ప్రచారకుడి మండిపాటు
నీచమైన విద్వేష ప్రసంగాలను, మసీదులు తగలబడుతున్న దృశ్యాలను వ్యాప్తి చేసేందుకు, హింసాత్మక కుట్ర సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ప్రకటనలు రూపొందించే సత్తా తమకు ఉన్నదని, ఆధిపత్య ధోరణి కలిగిన వారు, జాత్యాహంకారులు, నియంతలకు తెలుసునని ఎకో సంస్థ ప్రచారకుడు మయేన్‌ హమద్‌ తెలిపారు. ఇలాంటి వారి నుంచి మెటా సంస్థ డబ్బు తీసుకుంటుందని, అందుకు బదులుగా ఎలాంటి ప్రశ్నలు అడగదని చెప్పారు. తన వేదికలపై ఇస్లాంకు, ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవడంలో మెటా గతంలో కూడా విఫలమైందన్న ఆరోపణలు ఉన్నాయి. కీలకమైన ఎన్నికల సమయంలో తన వేదికల్లో పెద్ద ఎత్తున విద్వేష ప్రసంగాలు, దుష్ప్రచారం జరుగుతున్నప్పటికీ వాటిని అడ్డుకునే విషయంలో మెటా వద్ద నిర్దిష్ట ప్రణాళిక అంటూ ఏమీ లేదని హమద్‌ తెలిపారు. ఏఐ సాయంతో రూపొందించిన కొన్ని చిత్రాలను సైతం గుర్తించడంలో మెటా విఫలమైనప్పుడు దానిని ఎవరైనా ఎలా విశ్వసించగలరని ఆయన ప్రశ్నించారు.

Spread the love