– పలు జిల్లాలకు హెచ్చరిక
– రాత్రంతా అతి భారీ వర్షాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా కురుస్తున్న వానలతో రోడ్లన్ని జలమయమయ్యాయి. వాగులు, వంకలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఉపరితల ఆవర్తనం మంగళవారం నాటికి బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సోమవారం తెలియజేసింది. అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఉత్పన్నం కావచ్చొని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్ఛరికలు జారీ చేసింది. తొమ్మిది జిల్లాలకు ‘ఆరెంజ్’ అలెర్ట్, 18 జిల్లాలకు ‘ఎల్లో’ అలర్ట్‌ను ప్రకటించింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు జగిత్యాల, కరీంనగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీగా వానలు పడతాయని చెప్పింది.
ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను విడుదల చేసింది. మంగళవారం నుంచి బుధవారం వరకు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.