– పాతనగరంలో వడివడిగా విస్తరణ పనులు
– 170 మందికి ఇప్పటికే నష్టపరిహారం చెల్లింపు : మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి
– ఈవీ జిప్ సంస్థ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బైక్స్, క్యాబ్‌ల ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ ప్రపంచంలోని ప్రముఖ నగరాలతో పోటీపడాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పానికి అనుగుణంగా మెట్రో రైల్ వ్యవస్థను నగరం నలువైపులా విస్తరిస్తున్నట్టు హెచ్‌ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 69 కిలోమీటర్ల తొలి అడుగుతో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోని దాదాపు 200 కిలో మీటర్లకుపైగా విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఈవీ జిప్ సంస్థ హైదరాబాద్‌లో ‘మొదటి – చివరి మైల్ కనెక్టివిటీ’లో భాగంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, క్యాబ్‌లను శుక్రవారం ఎల్‌ఎండ్‌టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డితో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈవీ జిప్ సహా ఇప్పటివరకు 9 సంస్థలు ‘మొదటి-చివరి మైల్ కనెక్టివిటీ’ కింద తమ సేవలు అందిస్తున్నాయని చెప్పారు. ప్రతిరోజూ మెట్రోలో జర్నీ చేస్తున్న సుమారు 5 లక్షల మందిలో 1.25 లక్షల మందిని ఈ సంస్థల వాహనాలు గమ్యాలకు చేరుస్తున్నాయని తెలిపారు. వీటిలో మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మహిళలే నడిపే ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పుడు తొలిసారిగా ‘ఈవీ జిప్ ఈషా’ పేరున ప్రవేశపెట్టారన్నారు. ఈ వాహనాలను వందకుపైగా పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ ఈస్ట్ స్టేషన్‌ల నుంచి మల్కాజిగిరి, సైనిక్‌పురి, ఈసీఐఎల్ వంటి ప్రాంతాలకు ఎక్కువగా నడపనున్నారని తెలిపారు. వీటిని త్వరలోనే ఇతర స్టేషన్లకు, ప్రాంతాలకు విస్తరిస్తారని చెప్పారు.
ఇప్పటికే పాత నగరంలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రారంభించిన రహదారి విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం ప్రభావిత 1100 ఆస్తులకుగాను 170 ఆస్తులకు నష్టపరిహారం రూ.80 కోట్లు చెల్లించామన్నారు. కొద్ది రోజుల్లో మరో రూ.80 కోట్ల పరిహారం చెల్లించేలా ప్రభావిత ఆస్తుల ఓనర్‌షిప్ డాక్యుమెంట్ల పరిశీలన జరుగుతుందన్నారు. మొత్తం 270 మంది యజమానులు ఇప్పటికే స్వచ్ఛందంగా వారి ఆస్తులను మెట్రో రైల్ నిర్మాణం కోసం ఇవ్వడానికి ముందుకొచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ సీనియర్ అధికారులు మురళీ వరదరాజన్, రిషి వర్మ, కియోలిస్ మెట్రో ఎండీ ఎస్.సి.మిశ్రా, ఈవీ జిప్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీధర్ శివలెంక, సీతారాం చెరుకుపల్లి పాల్గొన్నారు.