రెండు దశల్లో మెట్రో రైల్‌ ప్రాజెక్టు

Metro rail project in two phases– ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి పి నారాయణ
అమరావతి : విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర రవాణా ప్రణాళిక (సిఎంపి) చేసినట్లు మున్సిపల్‌శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఈ ప్రణాళికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపామని, అనుమతి రాగానే ప్రాజెక్టుపై ముందుకు వెళ్తామని శాసనసభలో వెల్లడించారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పిజివిఆర్‌ నాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, బిజెపి శాసనసభపక్ష నేత పెనుమత్స విష్ణుకుమార్‌రాజు మెట్రో రైల్‌ ఎప్పటిలోగా పూర్తవుతుందని అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ.. విశాఖలో రెండు దశల్లో నాలుగు కారిడార్లలో మెట్రో రైల్‌ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామన్నారు. వందశాతం కేంద్ర ప్రభుత్వం భరించేలా రైల్వే శాఖకు అప్పగించేలా కేంద్రం ముందు ప్రతిపాదన ఉంచినట్లు తెలిపారు. ప్రతిపాదనలకు సంబంధించి కేంద్ర రైల్వే మంత్రికి లేఖ ఇవ్వడంతోపాటు సిఎం చంద్రబాబు కూడా ప్రధానికి లేఖ రాశారని తెలిపారు. మొదటి దశలో 46.23 కిలోమీటర్లు, రెండో దశలో 30.67 కిలోమీటర్లు అమలు చేసేందుకు ఎపి మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎమ్‌డి ప్రతిపాదనలు ఇచ్చారన్నారు. పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్య ప్రాతిపదికన ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 40 శాతం వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ను సమకూర్చేందుకు 76.9 కిలోమీటర్లతో రూ.14,300 కోట్ల ఖర్చుతో నాలుగు కారిడార్లలో ఏర్పాటుకు డిపిఆర్‌ ఇచ్చారన్నారు.
2021 ఏప్రిల్‌లోనే డిపిఆర్‌ ఇచ్చినప్పటికీ వైసిపి ప్రభుత్వం 2023 డిసెంబరు 15 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం మొదటి కారిడార్‌ను స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాది జంక్షన్‌ వరకు 34.4 కిలోమీటర్లు, రెండో కారిడార్‌లో గురుద్వార నుంచి పాత పోస్టాఫీసు వరకు 5.07 కిలోమీటర్లు, మూడో కారిడార్‌లో తాటిచెట్ల పాలెం నుంచి వాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.
మొత్తంగా 46.23 కిలోమీటర్ల మేర 42 స్టేషన్లతో నిర్మించే ప్రాజెక్టు 11,498 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. ఇక రెండో దశలో కొమ్మాది జంక్షన్‌ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 30.67 కిలోమీటర్లు 12 స్టేషన్లతో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. విశాఖ మెట్రో కారిడార్‌ వెళ్లే మార్గంలో ఎక్కువ క్రాసింగ్‌ వస్తున్న అంశాన్ని తమ సహచర ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రతి క్రాసింగ్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా కార్‌ షెడ్‌, ఎండాడ, హనుమంతువాక, మద్దిలపాలెం, విప్రో జంక్షన్‌, గురుద్వారా, అక్కయ్యపాలెం, తాటిచెట్టపాలెం, గాజువాక, స్టీల్‌ప్లాంట్‌ జంక్షన్‌ల వద్ద టూ లెవల్‌ మెట్రో, ఫ్లై ఓవర్‌లు నిర్మించే ప్రతిపాదన కూడా చేస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.

Spread the love