తీవ్ర తుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్

నవతెలంగాణ – అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుఫాను గంటకు 13 కి.మీ వేగంతో కదులుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ, మచిలీపట్నానికి 380కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా తుఫాన్ పయనించనుంది. రేపు మధ్యాహ్నం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా మిచౌంగ్ తీరం దాటనుంది. తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు కూడా కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ తీవ్ర భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ, సాయంత్రం నుంచి గంటకు 90-110 కీమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Spread the love