కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులలో నీరు నిల్వ పెట్టరాదనే గోదావరి, ప్రాణహిత నుండి వచ్చిన నీటిని ఉన్నది ఉన్నట్లుగా దిగువకు వదిలిపెట్టాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశించింది. మేడిగడ్డ కుంగుబాటుపై, అన్నారం బుంగపై విజిలెన్స్ శాఖ కూడా విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సి వుంది. రాష్ట్ర ప్రభుత్వం ఘోష్ కమిటీ వేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ సాగిస్తున్నాయి. పై మూడు కమిటీలు గోదావరి జలాలను సుందిళ్లలో, అన్నారంలో, మేడిగడ్డలో నిల్వ పెట్టరాదని ఆదేశించిన సాంకేతిక అంశం ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు తెలుసు. అయినప్పటికీ శాసనసభలోని ప్రతిపక్షం జులై 26 సందర్శించి ప్రాజెక్టులు దెబ్బతిన్నప్పటికీ ఉరికట్టలు వేసి నీటిని నిల్వపెట్టి పంపింగులు చేయాలని ప్రభుత్వానికి తప్పుడు సలహా ఇచ్చారు. ప్రభుత్వం లిఫ్ట్‌లు కొనసాగించకపోతే తామే 50వేల మంది రైతులను తీసుకొనివెళ్లి ఆగస్టు 5న పంపులు ప్రారంభిస్తామని ప్రతిపక్షం ప్రభుత్వ పక్షాన్ని హెచ్చరించింది. వాస్తవాన్ని గమనించిన ప్రతిపక్షం నీటి నిల్వ లేకున్నా మేడిగడ్డ నుండి ఎల్లంపల్లికి మూడు స్టేజీలుగా ఎగువకు ఎత్తిపోయడం సాధ్యం కాదన్న విషయం తెలిసి కూడా పంపులు కొనసాగిస్తామని చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది.
శ్రీరాంసాగర్ నీటిని డైవర్ట్ చేయాలి
ప్రస్తుతం గోదావరికి వస్తున్న వరదల వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి రిజర్వాయర్ మట్టం 1091అడుగులకు చేరుకుంది. దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ దిగువన ఒకేఒక ప్రాజెక్టు ఎల్లంపల్లి 20టిఎంసిల నీటి నిల్వతో వుంది. ఎల్లంపల్లి నుండి లిఫ్ట్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడారం, మోతే ద్వారా మిడ్‌మానేరు ప్రాజెక్టుకు నీళ్లు పంపుచేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 1న ప్రారంభించింది. మిడ్‌మానేరు నుండి లోయర్ మానేరు ద్వారా కాకతీయ కాలువ మొదటి, రెండవ దశలకు నీటిని ఇవ్వాలి. మిడ్‌మానేరులో 25టిఎంసిల నీటి నిల్వ లోయర్ మానేరులో 20టిఎంసిల నీటి నిల్వ చేయాలి. గోదావరిపై గల శ్రీరాం సాగర్ ద్వారా వస్తున్న నీటిని దిగువకు వెళ్లకుండా ఎల్లంపల్లికి డైవర్ట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటిని పంపిణీ చేయాలి. మిడ్‌మానేరు నుండి లోయర్ మానేరుకు ఒక కాలువ వెళుతుండగా, అదే మిడ్‌మానేరు నుండి అనంతగిరి, రంగనాయక సాగర్ ద్వారా మల్లన్నసాగర్ తిప్పారం ఆనకట్ట వద్దకు నీటిని పంపు చేయాలి. తిప్పారం ఆనకట్ట నుండి కుడివైపు కొండపోచమ్మ, శామీర్‌పేట చెరువులు నింపాలి. అలాగే ఎడమ వైపు గందమళ్ల, బస్వాపురం ప్రాజెక్టులు నింపాలి.
నిల్వనీటితో పంటలకు నష్టం
ఎల్లంపల్లి నుండి మిడ్‌మానేరు వరకు, అక్కడి నుండి తిప్పారం వరకు నీటిని పంపు చేయడం ద్వారా ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులలో నీటిని నిల్వ పెట్టవచ్చు. మేడిగడ్డ (16టిఎంసిలు) అన్నారం (10టిఎంసిలు), సుందిళ్ల (8టిఎంసిలు) ప్రాజెక్టులలో నీరు నిల్వ పెట్టడంతో ఈ ప్రాజెక్టుల వెనుక నీటి ద్వారా వేల ఎకరాల పంట భూమి నీట మునుగుతున్నది. గత నాలుగేండ్లుగా ఆ గ్రామాల ప్రజలు పంటలు నష్టపోయారు. నీటిని నిల్వ పెట్టి ఎగువకు ఈ రెండేండ్లలో 170 టిఎంంసిలు మాత్రమే మేడిగడ్డ నుండి ఎల్లంపల్లికి పంపింగ్ చేశారు. గోదావరికి వరదలు రావడంతో ఎల్లంపల్లిలో పంపింగ్ చేసి నిల్వ పెట్టిన నీటిని గోదావరి ద్వారా దిగువకు వదిలివేశారు. వాస్తవాలు తెలిసినప్పటికీ కొందరు నాయకులు కాళేశ్వరం పంపులను ఆగస్టు 5వరకు తామే ప్రారంభిస్తామని ఎలా చెప్పగలుగుతున్నారు? రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఆరోపణలు చేయడం రాష్ట్రంలో పరిపాటిగా సాగుతున్నది. వాస్తవాలను గుర్తించి భవిష్యత్తు ప్రణాళిక వేయడం, దానిని అమలుపరచడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం విజ్ఞులు చేయవలసిన పని. ఈ ఏడాది కలిసివస్తున్న వర్షాల వల్ల శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ద్వారా కాళేశ్వరం పథకానికి నీరు ఇవ్వాలి.
తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట అవసరం
అదే సందర్భంలో ప్రాణహితపై తుమ్మిడిహెట్టి వద్ద నుండి ఎల్లంపల్లికి (116కి.మి) కాలువ తీసి ఎల్లంపల్లికి ప్రత్యామ్నాయ నీటివనరు కల్పించాలి. ఈ మధ్య కేంద్ర ఇరిగేషన్ సలహాదారు వెదిరె శ్రీరాములు కూడా తుమ్మిడిహెట్టి వద్ద 160 టిఎంసిల నిఖర జలాల లభ్యత ఉన్నట్లు ప్రకటించారు. పెనుగంగా, వార్ధా, వెయిన్‌గంగా కలిసిన తుమ్మిడిహెట్టి ప్రాంతంలో 148మీ. ఎత్తు ఆనకట్ట కట్టడం వల్ల 2.8 టిఎంసిల నీరు నీల్వ వుంటుంది. తుమ్మిడిహెట్టి నుండి సుర్గపల్లె (28.5కి.మీ) ద్వారా మైలారం ప్రాజెక్టు వరకు (71.5కి.మి) వరకు కాలువ తీయబడింది. మైలారం నుండి ఎల్లంపల్లికి 45కి.మీ. ప్రస్తుతం కాలువ త్రవ్వాలి. ఈ కాలువతో పాటు తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట 148మీ (సముద్ర మట్టానికి) ఎత్తువరకు ఆనకట్ట నిర్మించాలి. ఎల్లంపల్లి వద్ద ఎత్తుకూడా 148 మీ. మాత్రమే ఉంది. అనగా మైలారం వద్ద 20మీ. ఎత్తు లిఫ్ట్ చేసినచో ఎల్లంపల్లికి నీరు వస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 80.80టిఎంసి లతో 12 లక్షల ఎకరాలకు సాగునీరు, 10టిఎం సిలతో వికారాబాద్, తాండూర్ జిల్లాలకు సాగునీరు, 7టిఎంసి లతో ముథోల్ (నిర్మల్)కు సాగునీరు హైదరాబాద్‌కు 30టిఎంసిల తాగునీటితో పాటు కాలువ వెంబడి గల గ్రామాలకు 10టిఎంసిలు, 16 టిఎంసిలు పరిశ్రమలకు 6.2 టిఎంసిల ఆవిరికి కేటాయింపు చూపారు. తుమ్మిడి హెట్టి నుండి ఎల్లంపల్లి – తిప్పారం ఆనకట్ట వరకు 3,375 మెగావాట్ల విద్యుత్ కావాలి. ప్రతిరోజు 138మి.యూనిట్లు అవసరం.
‘కాళేశ్వరం’ వ్యయం ఎవరు భరించాలి?
పై ప్రాజెక్టుకు బదులు మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి – తిప్పారం వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు 8,459 మెగా వాట్ల విద్యుత్ కావాలి. రోజుకు 203 మి.యూనిట్లు అవసరం. విద్యుత్ చార్జీల కింద రూ.10,374 కోట్లు, నిర్వహణ కింద రూ.10,647 కోట్లు కావాలి. ఎకరాకు ప్రభుత్వం చేసే వ్యయం రూ.46,364లు ఖర్చు అవుతాయని ఆధార సహితంగా కాగ్ నివేదిక స్పష్టంగా వివరించింది. ఇన్ని అనుభవాలు మన ముందున్నప్పటికీ ప్రతిష్ట కోసం ప్రతిపక్షం ”ఏనుగును ఇంటిముందు కట్టేసుకున్న” విధంగా కాళేశ్వరం వ్యయాన్ని ప్రజలు భరించాల్సిందేనా? తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరుగుతున్న ప్రయోజనాన్ని ఎందుకు గుర్తించడం లేదు? ఇప్పటికే రూ.వేల కోట్లు వ్యయం చేసిన తుమ్మిడిహెట్టి- ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎందుకు కొనసాగించకకూడదు? మేడిగడ్డ నుండి ఎల్లంపల్లికి 108 కి.మీ. కాగా, తుమ్మిడిహెట్టి నుండి ఎల్లంపల్లికి 116 కి.మి. మాత్రమే. తుమ్మిడిహెట్టి లెవల్, ఎల్లంపల్లి లెవల్ 148మీ. కావడం వల్ల లిఫ్ట్ వ్యయం తగ్గుతుంది. 20మి. ఎత్తు లిఫ్ట్ మైలారం వద్ద పెట్టడంతో ప్రాజెక్టు పూర్తి అవుతుంది.
నిర్వాసితుల త్యాగాలకు ఫలితమేది?
కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్‌కు గత కాంగ్రెస్ ప్రభుత్వం 1టిఎంసి నిల్వ శక్తితో ప్రాజెక్టు సూచించగా టీ(బీ)ఆర్‌ఎస్ ప్రభుత్వం 50టిఎంసిలకు పెంచింది. ఈ ప్రాజెక్టు దిగువన భూమి చీలివుందని భూ ప్రకంపనల అధ్య యన కేంద్రం ప్రకటించింది. అందువల్ల మల్లన్నసాగర్‌లో ప్రస్తుతం తక్కువ నీటిని నిల్వ పెడుతున్నారు. అలాగే కొండపోచమ్మలో కూడా 1టిఎంసి నుండి 15 టిఎంసిలకు పెంచడం జరిగింది. గందమల్ల రిజర్వాయర్ 9.87 టిఎంసిలు, బస్వాపురం 11.39 టిఎంసిలకు పెంచడం వల్ల నిర్వాసితులకు తీవ్రంగా నష్టపోయారు. 45 గ్రామాలు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇన్ని త్యాగాలు చేసినప్పటికీ ఆ ప్రాజెక్టు వల్ల లక్ష ఎకరాలకు కూడా ఈరోజు వరకు సాగునీరు ఇవ్వలేదు.
గోదావరి నీటిని ఎల్లంపల్లి పంపుల ద్వారా మిడ్‌మానేరుకు, లోయర్ మానేరుకు పంపుచేయడం ద్వారా కాకతీయ కాలువ మొదటి దశతో పాటు రెండవ దశకు నీరివ్వడానికి అవకాశం ఉంటుంది. గోదావరికి వరదలు వచ్చినప్పటికీ ఎల్లంపల్లి పంపులను కొనసాగిస్తూనే ఉండాలి. అంతేకాని ప్రతిష్టకు పోయి, ప్రతిష్టంభన సృష్టించడం వల్ల ప్రజలకు నష్టమే తప్ప న్యాయం జరగదు. ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారు.
సారంపల్లి మల్లారెడ్డి
9490098666