ప్రభుత్వానికి మిల్లర్లు సహకరించాలి

మంత్రి గంగుల కమలాకర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వానికి మిల్లర్లు సహకరించాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. గురువారం హైదరాబాద్‌ డా.బీ.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో మిల్లర్ల అసోసియేషన్‌ ప్రతినిధులతో యాసంగి ధాన్యం సేకరణ, సీఎంఆర్‌ నూక శాతం ఇతరత్రా సమస్యలపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నూక శాతంపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం. సీఎంఆర్‌ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. మిల్లర్ల ప్రతినిధులు మాట్లాడుతూ భారత ఆహార సంస్థ ముడి బియ్యం లక్ష్యంలో యాసంగిలో సగం కూడా రాదని తెలిపారు. కేంద్రం నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం దృష్ట్యా యాసంగిలో బాయిల్డ్‌ కు కేంద్రం అనుమతివ్వాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయంలో తాము భాగస్వాములమే అయినప్పటికీ శత్రువులుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి మాట్లాడుతూ, యాసంగి ధాన్యంలో నూక శాతంపై నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించిన నేపథ్యంలో వరి రకాలు, పరిస్థితులకు ఎలా అన్వయించాలో త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయించనున్నట్టు తెలిపారు. మిల్లర్లు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా యాసంగిలో ముడిబియ్యాన్ని ఇవ్వాలని కేంద్రం కోరుతుండటంతో రైతులు, మిల్లింగ్‌ ఇండిస్టీ ఇబ్బందులు పాలవుతున్నారని విమర్శించారు. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, జీఎం శ్రీనివాసరావు, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ గంపా నాగేందర్‌, ప్రధాన కార్యదర్శి ఏ.సుధాకర్‌ రావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి. ప్రభాకర్‌ రావు, ట్రెజరర్‌ చంద్రపాల్‌, అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Spread the love