తెలంగాణ అమరవీరులకు మంత్రి, కలెక్టర్, ప్రజాప్రతినిధుల శ్రద్హాంజలి

నవతెలంగాణ కంటేశ్వర్
జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా, ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, వీ.గంగాధర్ గౌడ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ నీతూకిరణ్ తదితరులు పూల మాలలు వేసి శుక్రవారం శ్రద్ధాంజలి ఘటించారు. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం,14 ఏళ్ల కేసిఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయ్యిందని మంత్రి వేముల అన్నారు. అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అనేక రంగాల్లో యావత్ దేశానికి దిక్సూచిగా నిలుస్తూ సగర్వంగా తలెత్తుకుని నిలబడిందని అన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధి స్పూర్తితో ఇకముందు కూడా తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love