పీవీకి భారతరత్న ప్రకటించడంపై మంత్రి దుద్దిళ్ల హర్షం

నవతెలంగాణ –  మల్హర్ రావు
తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల సృష్టి కర్త, బహుభాషా కోవిదుడు పీవి నరసింహ రావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల మాట్లాడారు. దేశ ప్రధానిగా పీవీ చేసిన సేవలు గుర్తు చేసుకోవడంతో పాటు పీవీ కి భారత రత్న ప్రకటించాలని, అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిందన్నారు. ఇప్పటికైనా పీవీ  సేవలు గుర్తించి, భారతరత్న ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంథని నియోజక వర్గం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన పీవీ నరసింహారావు దేశ ప్రధాని స్థాయి వరకు ఎదిగారని తెలిపారు. పూర్వం మంథని ఎమ్మెల్యేగా పీవీ నరసింహారావు పని చేశారని, అనంతర కాలంలో తన తండ్రి శ్రీపాదరావు కూడా అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారని, ఇప్పుడు తాను కూడా మంథని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటించడం కేవలం మంథని ప్రజలకే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణమని స్పష్టం చేశారు.
Spread the love