50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లతో రికార్డ్‌ : మంత్రి గంగుల

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా రికార్డ్‌ స్థాయిలో 50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఇప్పటి వరకు కొనుగోలు చేసినట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దాదాపు రూ.10,200 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని ఎనిమిది లక్షల మంది రైతుల నుంచి సేకరించినట్టు చెప్పారు. ఇందుకోసం రైతు చెంతనే ఉండే విధంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, కొనుగోలు పూర్తయిన వెంటనే రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.
100శాతం కొనుగోళ్లు పూర్తయిన1,400 కేంద్రాలను కొనుగోలు మూసివేసినట్టు వెల్లడించారు. గతేడాది కన్నా 12 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించినట్టు వెల్లడించారు. భారత ఆహార సంస్థ నిర్దేశించిన కనీస నాణ్యతా ప్రమాణాల ప్రకారం వచ్చిన ధాన్యంలో ఏ మిల్లర్‌ కోత పెట్టినా… కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిపక్షాలు కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయం చేయొద్దని హితవు పలికారు. విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా కొనుగోళ్లు జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని సూచించారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు.

Spread the love