మంత్రి గోడౌన్‌కు నిప్పు

– తూర్పు ఇంఫాల్‌లో ఘటన
– మణిపూర్‌లో ఇంకా అదుపులోకి రాని పరిస్థితులు
ఇంఫాల్‌ : మణిపూర్‌లో అధికార బీజేపీ నాయకులే లక్ష్యంగా నిరసనకారులు చేస్తున్న దాడులు ఆగటం లేదు. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఆ రాష్ట్ర ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి ఎల్‌. సుసింద్రో మెయిటీకి ఎదురైంది. మంత్రికి చెందిన రెండు ప్రయివేటు గోడౌన్‌లకు మూక నిప్పు పెట్టింది. తూర్పు ఇంఫాల్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నది. ఇటు జిల్లాలోని ఖురారు ప్రాంతంలో బీజేపీ నాయకుడి ఇంటికి కూడా నిప్పు పెట్టే ప్రయత్నమూ జరిగింది. అయితే, భద్రతా బలగాలు దానిని నిరోధించాయి. మూకను చెదరగొట్టడానికి అనేక రౌండ్ల టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ను ప్రయోగించాయి. మణిపూర్‌లో పరిస్థితిపై చర్చించటానికి అఖిలపక్ష సమావేశానికి కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చిన ముందు రోజే.. మంత్రి ఆస్థులపై దాడి ఘటన చోటు చేసుకోవటం గమనార్హం. మణిపూర్‌లో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఇండ్లపై ఆగ్రహంతో ఉన్న మూకలు దాడులు జరిపాయి. ఇందులో కేంద్ర మంత్రి ఆర్కే రంజన్‌ సింగ్‌, రాష్ట్ర మంత్రులు నెమ్చా కిప్‌గెన్‌, గోవిందాస్‌ కొంతౌజమ్‌, ఎమ్మెల్యేలు రఘుమణి సింగ్‌, రంజిత్‌ సింగ్‌, ఎస్‌ కెబి దేవి ల ఇండ్లు, ఆస్థులు ఉన్నాయి. రాష్ట్రంలోని హింసాత్మక పరిస్థితులకు బీజేపీ వైఖరే కారణమని అక్కడి ప్రజల్లో, నిరసనకారుల్లో ఉన్నది. మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులను నియంత్రించడానికి సరైన చర్యలు తీసుకోవటం లేదని ప్రధాని మోడీ, కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరును పలు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు సైతం విమర్శిస్తున్నాయి.

Spread the love