నవతెలంగాణ హైదరాబాద్: గవర్నర్ కోటా కింద ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తిరస్కరించడంపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరుకల జాతిలో ఒకరికి, విశ్వబ్రాహ్మణ కులంలో ఇంకొకరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాం. ఇలాంటి వారిని గవర్నర్ తిరస్కరించారు. దేశంలో బీజేపీ గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. విశ్వ బ్రాహ్మణులు, ఎరుకల కులాలు జట్టుకట్టి బీజేపీకి గుణపాఠం చెప్పాలి. ఏ పార్టీ అయినా ఎరుకల జాతికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందా..? బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఎన్నికైతే తప్పా..? బీఆర్ఎస్ ఏమైనా నిషేధిత పార్టీనా..? ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వాళ్లకే నామినేట్ పదవులు కట్టబెట్టారు. ఆ రాష్ట్రానికి ఒక నీతి.. తెలంగాణకు ఒక నీతా..? కులాలు, జాతుల గురించి ఆలోచించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.