– అనాధకు, గుండె జబ్బు బాధితురాలికి భరోసా
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
ఆపదలో ఉన్నవారికి తానున్నాననే ధైర్యమివ్వడమే కాకుండా అండగా నిలుస్తున్నారు రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రి మరోసారి తన ఉదారతను చాటుకుని దానిని నిజం చేశారు. గుండెజబ్బుతో బాధపడుతున్న ఒక యువతికి, అలాగే తల్లిదండ్రులు చనిపోయి అనాధగా మిగిలిపోయి చదువుకోవడం ఇబ్బందిగా మారిన 10వ తరగతి అమ్మాయికి అన్నీ తానై చూసుకుంటానని భరోసా ఇచ్చి అండగా నిలబడ్డారు. నల్గొండ జిల్లాలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఆయన తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న మున్సిపల్ పార్కులో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా నల్గొండకు వచ్చిన ప్రతిసారి వేల సంఖ్యలో ప్రజలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వారి కష్టాల వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే శని, ఆది వారాలు రెండు రోజుల జిల్లా పర్యటనలో ఉన్న ఆయనకు క్యాంపు కార్యాలయంలో వేలాదిమంది ప్రజలు వారి విజ్ఞప్తులను సమర్పించారు. ఆదివారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ సందర్భంగా నల్గొండ జిల్లా దుప్పలపల్లికి చెందిన స్వాతి అనే యువతి తాను గుండెజబ్బుతో బాధపడుతున్నానని, తనకు సహాయం చేయాలని కోరగా తక్షణమే మంత్రి స్పందించి స్వాతి గుండె జబ్బును నయం చేసేందుకు ఆస్పత్రి ఖర్చులన్ని తానే భరిస్తానని తెలిపారు. అలాగే 10వ తరగతి చదివే సంతోషి రూపా అనే విద్యార్థిని తల్లిదండ్రులు చనిపోయి అనాదగా మిగిలిపోగా పై చదువులు సైతం చదవలేనని మంత్రికి మొరపెట్టుకోగా సంతోషి రూప పదవతరగతి చదివేందుకయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని,అలాగే ఆమె బాధ్యతలన్ని తానే చూసుకుంటానని, సంతోష్ రూపను దత్తత తీసుకోవడమే కాకుండా అన్ని ఖర్చులు తాను భరిస్తానని చెప్పారు.ఇలా అనేక మంది వివిధ రకాల సమస్యలతో మంత్రికి వినతి పత్రాలు సమర్పించగా, సాధ్యమైనంతవరకు వాటన్నింటినీ ఆయన ఓపికగా విని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడమే కాకుండా, తక్షణమే జిల్లా కలెక్టర్, ఎస్పి,ఆర్డీవోలు, సంబంధిత అధికారులు, తహసిల్దార్లతో ఫోన్ ద్వారా సంప్రదిస్తూ సమస్యను పరిష్కరిస్తున్నారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుండటం పట్ల జిల్లా ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్ ల్లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్గొండ ఆర్డీవో రవి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, తదితరులు ఉన్నారు.