రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5 నుండి 9 వరకు నిర్వహించే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని మున్సిపల్ తో పాటు, అన్ని గ్రామాల్లో చెత్తను తొలగించి, మొక్కలు నాటాలన్నారు. అధికారులు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, త్రాగునీరు కలుషితం కాకుండా, మురుగు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, ప్లాస్టిక్ వాడకంతో వచ్చే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు, యువజన స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. వన మహోత్సవం ద్వారా ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలన్నారు. మానవ మనుగడకు పర్యావరణమే కీలకమని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి స్వచ్ఛతనం పచ్చదనం దోహదపడుతుందని మంత్రి అన్నారు అనంతరం హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్నేహితుల దినోత్సవం సందర్భంగా కౌన్సిలర్లు మంత్రి పోన్నం ప్రభాకర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పిసిసి సభ్యులు కేడం లింగమూర్తి, కౌన్సిలర్ చిత్తారి పద్మ, హుస్నాబాద్ మండల అధ్యక్షులు బంక చందు, పక్కన పేట మండల అధ్యక్షుడు జంగంపల్లి ఐలయ్య, ముత్యాల సంజీవరెడ్డి, కాశబోయిన రవి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.