నవతెలంగాణ – భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఓపీఎస్ భదోరియా ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ట్రాలీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి భదోరియా తలకు తీవ్ర గాయాలయ్యాయి. మంత్రితోపాటు మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మంత్రి భద్రతాసిబ్బందిలో కూడా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులందరూ ప్రస్తుతం గ్వాలియర్‌లోని బిర్లా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మంత్రి గ్వాలియర్ నుంచి మెహ్‌గావ్‌కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్‌ను అక్కడే వదిలేసి పారిపోయిన డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.