– లబ్దిదారుల దీక్షలకు జూలకంటి మద్దతు
– వెంటనే ఇండ్లు కేటాయించాలని డిమాండ్
నవ తెలంగాణ-క్లాక్‌టవర్
లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులకు వెంటనే స్వాధీన పరచడానికి జిల్లా మంత్రి జోక్యం చేసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో లబ్దిదారులు నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని జూలకంటి సందర్శించి దీక్షాపరులకు పూలదండలు వేసి ప్రారంభించి మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పథకంలో భాగంగా నల్లగొండ పట్టణంలో సుమారు 552. ఇండ్లను నిర్మించారన్నారు. ఇండ్లు నిర్మించి ఏడేండ్లు గడుస్తున్నా లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్దిదారులకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా నల్లగొండ పట్టణంలో ఎంపిక చేసిన లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరారు. రిలే దీక్షలకు తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలిపారు. అవసరమైతే కలెక్టర్, మంత్రులతో ముఖ్యమంత్రి మాట్లాడి ఇండ్లు ఇచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు, మాజీ కౌన్సిలర్ ఎండి. సలీం మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణ 48 వార్డుల నుంచి ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులు రెండో రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, ఆవాజ్ సంఘం జిల్లా కార్యదర్శి సయ్యద్ హశం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికారు మల్లేశ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కంబాలపల్లి ఆనంద్, మహిళా జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల పద్మ, సహాయ కార్యదర్శి భూతం అరుణ కుమారి, కునుకుంట్ల ఉమారాణి, సీఐటీయూ పట్టణ నాయకులు అద్దంకి నరసింహ, కోట్ల అశోక్ రెడ్డి, డీవైఎఫ్‌ఐ నాయకులు నరేష్, రైతు సంఘం నాయకులు ఊట్కూరు మధుసూదన్ రెడ్డి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పోరాట కమిటీ కన్వీనర్, మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్, కో కన్వీనర్ గంజి నాగరాజు పాల్గొన్నారు.