బీజేపీకి బీఆర్ఎస్ ఎంత కప్పం కడుతోందో కేటీఆర్ చెప్పాలి: మంత్రి

నవతెలంగాణ – హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు సరికాదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో అన్ని అంశాలు బయటకు వస్తాయని హెచ్చరించారు. కేటీఆర్ ఎవరికైనా నోటీసులు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చునని స్పష్టం చేశారు. పద్ధతి ప్రకారమే విచారణ జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పద్ధతి ప్రకారం పని చేస్తుందన్నారు. ఏమైనా అంటే ఢిల్లీకి కప్పం కడుతున్నారని అంటున్నారని… అలాంటప్పుడు బీజేపీకి బీ టీంగా ఉన్న బీఆర్ఎస్ ఎంత కప్పం కడుతోందో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందన్నారు. మిషన్ భగీరథ ఓ తప్పుడు స్కీం అని విమర్శించారు. మిషన్ భగీరథ కంటే ముందే తాము ప్రతి ఊరికి నీళ్లు ఇచ్చామన్నారు. దానిని ధ్వంసం చేసింది ఎవరో చెప్పాలన్నారు. రూ.45వేల కోట్లు ఖర్చు చేసినా నీటికి ఎందుకు ఇబ్బంది వస్తోందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరూ బయటకు వస్తారన్నారు. బీఆర్ఎస్ హయాంలో అందరి ఫోన్లను ట్యాప్ చేశారని మండిపడ్డారు. విచారణలో అన్నీ బయటకు వస్తాయన్నారు. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమకు ఎక్కువ సీట్లు వస్తాయనే బీఆర్ఎస్ తమపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. తాము ప్రజల డబ్బును ప్రజలకే ఖర్చు చేస్తున్నామన్నారు. నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.

Spread the love