ఆర్థిక క్రమశిక్షణతో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం: మంత్రి శీధర్ బాబు

– అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
– ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం
– త్వరలో మరో రెండు గ్యారెంటి పథకాల అమలు
– 3.5 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకస్థాపనలు
– తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
ఆర్థిక క్రమశిక్షణ తో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, నిర్ణీత సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ తప్పనిసరిగా నెరవేరుస్తామని  రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం రాత్రి పలిమల మండల కేంద్రంలో బస చేసిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తో కలిసి రూ.3.5 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పలిమల మండల కేంద్రంలో రూ.65 లక్షల  నిధులతో  సమీకృత మండల కార్యాలయాల భవనం, రూ. కోటి 43 లక్షల నిధులతో  ప్రాదమిక ఆరోగ్య కేంద్ర భవనం, నిర్మాణ పనులకు శంకుస్థపన చేశారు అంతే కాకుండా పలిమల మండల వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు , ఇదివరకు ఉన్న అంగన్వాడీ కేంద్రాల మరమ్మత్తులకు రూ.90 లక్షల నిధులు కేటాయించగా రూ.32 లక్షల నిధులతో 2 అంగన్వాడి బిల్డింగ్ ల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సంద  మంత్రి మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన అందించేందుకు తమ ప్రభుత్వం ఏర్పడిందని, మారు మూల ప్రాంతమైన పలిమల అభివృద్ధికి కట్టుబడి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ఒక వైపు మహారాష్ట్ర మరోవైపు చత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాలుగా ఉన్న పలిమల మండలంలో  ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మండల కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేస్తూ  సమీకృత మండల కార్యాలయాల భవనాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో కోటి నలభై లక్షల పైగా ఖర్చు చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.మండల వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు రూ. 90 లక్షలు మంజూరు చేయడం జరిగిందని రూ.32 లక్షలతో రెండు అంగన్వాడి కేంద్రాలు నిర్మిస్తున్నామని, మరో రెండు కేంద్రాలను త్వరలోనే నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులలోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళా సాధికారత సాధ్యమైందని,  మారుమూల ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగ పడుతుందని  అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితి ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచామని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మరో రెండు గ్యారెంటీలను త్వరలో అమలు చేస్తామని, ఇటీవల నిర్వహించిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో రూ.500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలను ఆమోదించామని, పేదలందరికీ త్వరలో ఈ పథకాలను అందజేస్తామని మంత్రి తెలిపారు. గతంలో ప్రభుత్వం ఏర్పడిన 36 రోజుల తర్వాత అసెంబ్లీ నిర్వహించిన వారు నేడు చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం పట్ల అనవసరపు వదంతులు సృష్టిస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, అదేవిధంగా మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని తప్పనిసరిగా నెరవేరుస్తామని, ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ ను ప్రజలకే ఖర్చు చేస్తామని గత ప్రభుత్వం లాగా కాకుండా వృధా ఖర్చులను నివారిస్తామని  మంత్రి తెలిపారు. మారుమూల ప్రాంతమైన పలిమల మండల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఒక ప్రణాళిక బద్ధంగా పలిమెల మండలాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.అంతకుముందు పలిమెల మండలం నుంచి హన్మకొండకు ఎక్స్ప్రెస్ బస్సు నైట్ హాల్ట్ సర్వీసును మంత్రి ప్రారంభించారు. అనంతరం పంకన గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాలల సందర్శించి విద్యా బోధన పద్ధతులను గురించి అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 10వ  తరగతి విద్యార్థులతో ముచ్చటించి, ఉపాధ్యాయులు బోధిస్తున్న విద్యా బోధన , డిజిటల్ తరగతుల  వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మరమ్మత్తులు చేసి, ప్రిన్సిపాల్ గది స్టాఫ్ రూమ్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love