మేడారం మహాజాతరలో ఉద్యోగుల పనితీరు అభినందనీయం: మంత్రి సీతక్క

– పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
– జాతర విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఉద్యోగికి ప్రత్యేక  ధన్యవాదాలు 
– శాలువాలతో ఘనంగా సన్మానం చేసిన సీతక్క
నవతెలంగాణ – తాడ్వాయి
మేడారం మహా జాతరలో జాతర విజయవంతం చేయడానికి ఉద్యోగుల పనితీరు అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క అన్నారు. ఆదివారం మేడారం  శ్రీ మేడారం సమ్మక్క సారమ్మ మహా జాతరలో విధులు నిర్వర్తించిన  అధికారులకు మేడారం అమ్మవార్ల గద్దేల ప్రాంగణం లో శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఏటూర్ నాగారం ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్,  జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ, అదనపు కలెక్టర్ రెవెన్యూ వేణు గోపాల్ డీఎస్పీ రవీందర్ లను శాలువాలు కప్పి, మెమెంటో అందించి మంత్రి సీతక్క సన్మానించారు. ఈ సందర్బంగా  మంత్రి మాట్లాడుతూ తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన శ్రీ సమ్మక్క సాలమ్మ మహా జాతరను విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఉద్యోగి పనితీరు ప్రశంసనీయమని  అన్నారు. జాతరలో విధులు నిర్వర్తించడానికి వచ్చిన ఇతర జిల్లాల ఉద్యోగులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అహర్నిశలు కష్టపడ్డ 20 శాఖలకు చెందిన అధికారుల పనితీరు  అభినందనీయం అని, జాతర లో ఉద్యోగులు తమ  అనుభవాన్ని ఒక లేఖ రూపం లో అందించాలని వచ్చే జాతరలో  భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు అదించడానికి మి సూచనలు సలహాలు పాటిస్తామని అన్నారు. వచ్చే జాతరలో శాశ్వత అభివృద్ధి పనులతో భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు జరుగుతుందని తెలిపారు.జాతర ముగిసిన అనంతరం కుడా భక్తుల రద్దీ కొనసాగుతుందని ముఖ్యంగా జాతర ముగిసిన అనంతరం పారిశుద్ధ్య పనులు మేడారం పరిసర ప్రాంతాల్లో నిరంతరం జరిగేలా చూడాలని అన్నారు. అనంతరం జిల్లా అధికారులు మంత్రి సీతక్క ను శాలువాతో సత్కరించారు. ఈ  కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి అలెం అప్పయ్య, పంచాయతీ అధికారి వెంకయ్య, దేవాదాయ శాఖ అధికారి రాజేందర్,  స్థానిక రెవెన్యూ అధికారి తోట రవీందర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love