నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. మోడీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు పాతరేసింది. కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు జర్నలిస్టులను బెదిరిస్తున్న ఘటనలు పదేపదే జరుగుతున్నాయి. గోద్రా అల్లర్లపై డాక్యుమెంటరీ విడుదల చేసిన బీబీసీపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పిన విషయం విదితమే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జర్నలిస్టులను బెదిరించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జూన్ 9న అమేథీలో పర్యటించారు. కార్యక్రమాలు ముగించుకొని తిరిగి వెళ్తున్న మంత్రిని దైనిక్ భాస్కర్‌కు చెందిన జర్నలిస్టు విపిన్ యాదవ్ ఏదైనా మాట్లాడాలని అడిగారు. జర్నలిస్టు మాటలను అవమానంగా భావించిన మంత్రి అతని వైపు వేలు చూపిస్తూ బెదిరింపులకు దిగారు. ‘సేలన్‌లో మాట్లాడాను. ఇక్కడా మాట్లాడాలని అంటున్నారు. మీరు అమేథీ ప్రజలను అవమానిస్తున్నారు. మీ యాజమాన్యానికి నీ గురించి చెబుతాను’ అంటూ బెదిరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే దైనిక్ భాస్కర్ యాజమాన్యం జర్నలిస్టులు విపిన్ యాదవ్, హుస్సేన్‌ను విధుల నుంచి తొలగించింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యవహరించిన తీరుపై ముంబై ప్రెస్ క్లబ్ స్పందించింది. ఆమె తీరును ఖండించింది. అహంకారంతో మాట్లాడడం సరికాదని హితవు పలికింది. జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మంత్రిని ప్రశ్నిస్తే ఆమె నియోజకవర్గ ప్రజలను అవమానించినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించింది.