నవతెలంగాణ – వరంగల్
మూడు మెడికల్ కాలేజీల నగరంగా వరంగల్ మారిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హన్మకొండలో ఫాదర్ కొలంబో వైద్య కళాశాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీ దయాకర్, మేయర్ సుధారాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాదర్ కొలంబో కల నేడు నెరవేరిందని, ఉద్యమ సమయంలో నుంచి తాను దీని గురించి వింటున్నానన్నారు. తెలంగాణ ప్రభుత్వం కుల, మతాల తేడా లేకుండా అందరికీ సమ అవకాశాలు ఇస్తుందన్నారు. 60 ఏళ్లలో 3 ప్రభుత్వ కాలేజీలు ఉంటే.. తొమ్మిదేళ్లలో ఆ సంఖ్య 21కి చేరిందన్నారు. నాడు ప్రభుత్వ, ప్రైవేటులో మొత్తం 20 మెడికల్ కాలేజీలు ఉంటే నేడు 55కు చేరాయన్నారు. ఎంబీబీఎస్ సీట్లు నాడు 2950 ఉండగా.. నేడు 8,340 సీట్లకు పెరిగాయన్నారు. వరంగల్ నగరంలో మూడు మెడికల్ కాలేజీలు ఉండే నగరమైందని, తెలంగాణ రావడం, సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. మెడికల్ కాలేజీ అంటే 500 పడకల ఆసుపత్రి వస్తదని, దీంతో ఇక్కడి వారికి ఉపాధి వస్తుందన్నారు. ఈ ప్రాంతం ప్రాంతం అభివృద్ధి జరుగుతుందన్నారు. భూపాలపల్లి, జనగాంలో మెడికల్ కాలేజీలు వచ్చాయని, ములుగులో మెడికల్ కాలేజీ వస్తుందన్నారు. ఉత్తర తెలంగాణకు వైద్య సేవలు అందించేందుకు హెల్త్ సిటీ నిర్మాణం రూ.1100 కోట్లతో జరుగుతున్నదన్నారు. ఈ ఆసుపత్రి ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలని కోరుతున్నానన్నారు. ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంటుందని, సీఎం కోసం ప్రార్థన చేయాలని, అండగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ పాత మిషన్ ఆసుపత్రి మించి కొలంబో ఆసుపత్రి పని చేయాలని సూచించారు. అనంతరం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.