ఢిల్లీలో వర్ష బీభత్సం.. మునిగిన మంత్రి నివాసం

నవతెలంగాణ – ఢిల్లీ
ఉత్తరాదిన కురుస్తున్న కుండపోత వర్షాలు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, ఇతర ఘటనలలో మృతుల సంఖ్య 19కు చేరింది. అందులో ఇద్దరు సైనికులు ఉన్నారు. ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రహదార్లు జలమయమయ్యాయి. ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర వరకు 260 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గజియబాద్‌ ట్రోనికా సిటీలో ఇళ్లలోకి వరదనీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు అర్ధరాత్రి ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టింది. ఢిల్లీ మంత్రి అతిశీ నివాసం నీటి మునిగింది. హిమాచల్ ప్రదేశ్​, ఉత్తరాఖండ్, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్‌లలో కొన్ని ప్రాంతాల్లో సోమవారం కూడా అతిభారీ వర్షాలు కరుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. హిమాచల్‌లో 10జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. బియాస్ నది నీటిమట్టం పెరగడం వల్ల నాగవాయిలో ఆరుగురు చిక్కుకోగా.. అర్ధరాత్రి సహాయక చర్యలు చేపట్టారు. బాషింగ్‌లో బియాస్ ఉద్ధృతికి ట్రక్కులు కొట్టుకుపోయాయి. లేహ్-మనాలి హైవే, జాతీయ రహదారి 3 ధ్వంసమైంది. ఆయా రాష్ట్రాల్లోని అనేక రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. రికార్డు వర్షాల నేపథ్యంలో రోడ్లు, నివాస ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. వాహనాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. దిల్లీ, గురుగ్రామ్, నోయిడాలో పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు.
Spread the love