సామరస్యానికి తెలంగాణ ప్రతీక మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ

– దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రవీంద్రభారతిలో ఘనంగా సాహిత్యోత్సవం
నవతెలంగాణ-కల్చరల్‌
తెలుగు, ఉర్దూ భాషలు తెలంగాణ ప్రాంతంలో పాలు నీరులా కలసి ఉంటాయని, గంగాజమునా కా తెహజీబ్‌కు ప్రతీక తెలంగాణ రాష్ట్రమని మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రధాన వేదికపై తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా సాహిత్య అకాడమీ, బాషా సాంస్కృతిక శాఖ నిర్వహణలో సాహిత్యోత్సవంగా ఉర్దూ తెలుగు కవులు సమ్మేళనం జరిగింది. ఉర్దూ భాషా కవులు, తెలుగు భాషా కవులు పెద్ద ఎత్తున హాజరు కావడంతో రవీంద్ర భారతి ఆడిటోరియంలో పండుగ వాతావరణం కనిపించింది. హౌం మంత్రి మహమూద్‌ అలీ కవి సమ్మేళనంను ప్రారంభిస్తూ మాట్లాడారు. తెలంగాణలో ఉర్దూ ప్రాధాన్యత రాష్ట్ర ఆవిర్భావం తరువాత పెరిగిందన్నారు. గత ముఖ్యమంత్రులు పీవీ, చెన్నారెడ్డిలకు తప్ప ఎవరికి ఉర్దూ రాదని, ఇప్పుడు కేసీఆర్‌కు భాషపై పట్టు ఉందన్నారు. ఉర్దూ తెలిసిన అధికారులకు ప్రాముఖ్యత ఇస్తున్నారని తెలిపారు. ఉర్దూ, తెలుగు కవులు ఒకే వేదికపై కవిత్వం చదవటం అరుదైన సంఘటన అన్నారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. 33 జిల్లాల్లో కవి సమ్మేళనం జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రజలది కలసి మెలసి జీవించే సంస్కృతి అని, దర్వాజ, పరార్‌, చౌరస్తా వంటి ఉర్దూ పదాలు తెలుగులో మిళితమైనాయని వివరించారు. చివరి నైజాం కాలంలో కొంత ఇబ్బంది పడ్డా మంచి కూడా ఎక్కువ జరిగిందన్నారు. సాహిత్య అకాడమీ చైర్మెన్‌ జూలూరి గౌరీ శంకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు కన్నీళ్లు, నెత్తురుతో నేల తడిసిందని, రాష్ట్రం వచ్చినక నీళ్లు చెరువులతో కళకళ లాడుతోందని అన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మెన్‌ ముజిబుద్దీన్‌ మాట్లాడుతూ.. ఉర్దూ కవులకు ముగ్ధుమ్‌ మోహినుద్దీన్‌ పేరిట అవార్డ్స్‌ ఇస్తున్నామని తెలిపారు. ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ.. మంచి చేసే ప్రభుత్వాలకు కవులు ప్రచారం చేయాలని, ఇలా చైనాలో ఉందని తెలిపారు. కార్యక్రమంలో అధికార భాష సంఘం చైర్మెన్‌ మంత్రి శ్రీదేవి, గ్రంథాలయ పరిషత్‌ చైర్మెన్‌ ఆయాచితం శ్రీధర్‌, మైనార్టీ కమిషన్‌ చైర్మెన్‌, సలహాదారు ఏ.కె.ఖాన్‌, పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు సంచాలకుడు డాక్టర్‌ మామిడి హరికృష్ణ పర్యవేక్షణ చేశారు. ఉర్దూ ముషాయిరా, ఖవాలీ, తెలుగు పద్య, వచన కవిత్వంతో తెలంగాణ సంస్కృతి పరిమళించింది.

Spread the love