నవతెలంగాణ -హైదరాబాద్: రాజకీయ నాయకులైతే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పనికిరారా? అని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై ప్రశాంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘గవర్నర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి నుంచి నేరుగా గవర్నర్ కాలేదా? సర్కారియా కమిషన్ సిఫార్సులు పాటించాలని గతంలో చెప్పిన ప్రధాని.. వాటిని తుంగలో తొక్కి మిమ్మల్ని గవర్నర్ చేయలేదా? మీకు నైతికత ఎక్కడిది? అలా అయితే మొదట మీరే రాజీనామా చేయాలి.. అన్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చర్య సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు వంటిదని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై రాష్ట్ర క్యాబినెట్ చేసిన సిఫారసును గవర్నర్ తిరస్కరించడాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తప్పుపట్టారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం క్యాబినెట్‌లో చర్చించి, ఆమోదించి పంపిన సిఫారసును గవర్నర్ ఆమోదించకపోవటం రాజ్యాంగ వ్యతిరేకమని ఆక్షేపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని.. రాజకీయ కక్ష్య సాధింపులకు పాల్పడుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వాల అభీష్టానికి అనుగుణంగా గవర్నర్లు వ్యవహరించాలని సూచించారు. గతంలో ఏ గవర్నర్ ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.