ఆరోగ్యానికి పుదీనా

నేడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య సరైన జీర్ణక్రియ లేకపోవడం.. తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వక మలబద్దకం ఏర్పడి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పుదీనా క్రమం తప్పకుండా వాడితే మంచిదని వెద్యులు సూచిస్తున్నారు. పుదీనాను ఏయే పదార్థాలతో ఏ విధంగా ఉపయోగించవచ్చో ఓ సారి తెలుసుకుందామా..!

 పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకులు, దాల్చిన చెక్క కలిపి నూరి ప్రతి రోజూ 2-3 చెంచాలు సేవిస్తూ వుంటే అరుగుదల పెరుగుతుంది.
జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలి తర్వాత ఒక గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఉపశమనం కలుగుతుందట.
పుదీనా కషాయం ఎలాంటి జ్వరాన్నైనా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ కషాయం వల్ల కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.
పుదీనా, మిరియాలు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు కలిపి మొత్తం నూరుకుని సేవిస్తే ఉదరసంబందిత వ్యాధులు నివారణ అవుతాయి. ఆకలి ఎక్కువగా లేని వారు, పుల్లటి తేన్పులతో బాధపడేవారు, కడుపులో గ్యాస్‌ పేరుకుపోయి ఇబ్బంది పడేవారు కూడా దీన్ని తినవచ్చు.
గర్భం దాల్చిన మొదటి రోజుల్లో కొంతమంది వాంతులతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు చెంచాడు పుదీనా రసంలో అదే కొలతలో నిమ్మరసం, తేనే కలుపుకుని తాగుతూ ఉంటే వాంతులు, వికారం తగ్గుతాయి.
నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి ముందు ఈ ఆకుల్ని ఒక గ్లాసుడు నీళ్ళల్లో వేసి మూతపెట్టి అరగంట తర్వాత తాగితే మంచి నిద్ర పడుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
అరికాళ్ల మంటలకు పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి పేస్టులా చేసుకోవాలి. ఫ్రిజ్‌లో కాసేపు ఉంచిన తరువాత బయటకు తీసి చల్లగా ఉన్నప్పుడు అరికాళ్లకు రాస్తూ ఉంటే మంటలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
పుదీనా ఆకుల్ని ఎండబెట్టి దానిని టీ పొడిలో కలిపి టీ చేసుకుని తాగితే గొంతునొప్పి తగ్గుతుంది.
చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని చేతితో రసంలా తీసి ఆ రసంలో దూదిని ముంచి ఆ డ్రాప్స్‌ చెవిలో, ముక్కులో వేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్‌ క్రమంగా తగ్గిపోతుంది.
నోరు దుర్వాసన వచ్చేవారు పుదీనా ఆకుల్ని ఎండబెట్టి పొడిచేసి అందులో కాస్త ఉప్పు వేసుకుని ఆ పొడితో రోజూ పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన మాయం అవ్వటమే కాదు చిగుళ్ళు కూడా గట్టిపడతాయి.

Spread the love