మిషన్‌ 2023!

– భారత్‌, విండీస్‌ తొలి వన్డే నేడు
– రాత్రి 7 నుంచి డిడిస్పోర్ట్స్‌లో
– భారత్‌ ప్రపంచకప్‌ సన్నద్ధత
– పోటీ ఇవ్వటంపైనే విండీస్‌ గురి
నవతెలంగాణ-బ్రిడ్జ్‌టౌన్‌
2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు మరో రెండు నెలలు గడువే ఉంది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో తుది జట్టు రూపుపై టీమ్‌ ఇండియా ఓ అవగాహనకు రాలేదు. కరీబియన్లతో వన్డే సిరీస్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నట జట్టు మేనేజ్‌మెంట్‌.. కొన్ని ప్రత్యామ్నాయ అవకాశాలపై ఓ అంచనాకు రానుంది. వన్డే సిరీస్‌తో టీమ్‌ ఇండియా ప్రపంచకప్‌ సన్నద్ధతకు సై అంటుండగా.. 2023 వరల్డ్‌కప్‌కు దూరమైన కరీబియన్లు గమ్యం లేని గమనం దిశగా సాగుతున్నారు!. మూడు వన్డేల్లో రోహిత్‌సేనకు గట్టి పోటీ ఇవ్వటమే వెస్టిండీస్‌ ముందున్న ప్రస్తుత లక్ష్యం!. భారత్‌, వెస్టిండీస్‌ తొలి వన్డే పోరు నేడు.
స్వదేశంలో మెగా టైటిల్‌ వేటకు సమర శంఖం పూరించేందుకు.. కరీబియన్‌ గడ్డపై సన్నద్ధతకు సై అంటోంది రోహిత్‌సేన. సుదీర్ఘ విరామం అనంతరం ఐసీసీ టైటిల్‌పై కన్నేసిన భారత్‌.. స్వదేశంలో జరుగుతున్న 2023 వన్డే వరల్డ్‌కప్‌కు జట్టు కూర్పును కుదర్చుకునే పనిలో నిమగమైంది. కొందరు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరం కాగా.. ప్రత్యామ్నాయ వనరులపై రోహిత్‌, ద్రవిడ్‌ ద్వయం దృష్టి నిలిపింది. ప్రపంచకప్‌ నేపథ్యంలో వన్డే సిరీస్‌కు టీమ్‌ ఇండియా రెఢ అవుతుండగా.. వెస్టిండీస్‌కు ఎటువంటి లక్ష్యం లేదు. ఈ సిరీస్‌లో ఓటమి, గెలుపు ఆ జట్టును ఏ విధంగా ప్రభావితం చేయలేవు. అయితే, అగ్రజట్టు భారత్‌పై సత్తా చాటేందుకు కరీబియన్‌ కుర్రాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో నేడు కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ వేదికగా తొలి పోరు. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ఆరంభం కానుంది. దూరదర్శన్‌ స్పోర్ట్స్‌, జియో సినిమాలో భారత్‌, విండీస్‌ వన్డే మ్యాచ్‌ను వీక్షించవచ్చు.
సంజుకు అవకాశం దక్కేనా?
ప్రతిభావంతుడు, మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థుడు. అయినా, నిలకడలేమి ప్రదర్శన అతడి అవకాశాలను ప్రభావితం చేస్తుంది. వన్డే ఫార్మాట్‌లో కెరీర్‌ మొదలై, ముగిసే అన్నట్టు సాగుతుంది. ప్రధాన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఎన్‌సీఏలో కోలుకుంటున్న తరుణంలో.. 50 ఓవర్ల ఫార్మాట్‌లో, ప్రత్యేకించి ప్రపంచకప్‌ ప్రణాళికల్లో చోటు సాధించేందుకు సంజు శాంసన్‌ ఉవ్విళ్లూరుతున్నాడు. గతంలో మాదిరి కాకుండా, సంజు శాంసన్‌కు ఈ సారి సిరీస్‌లో మూడు మ్యాచుల్లోనూ ఆడే అవకాశం లభించవచ్చు. విండీస్‌తో టెస్టుల్లో ఆడిన ఇషాన్‌ కిషన్‌ నుంచి పోటీ ఎదురైనా.. ఈ ఫార్మాట్‌లో సంజు శాంసన్‌కు చాన్స్‌ ఇచ్చేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ ఫార్మాట్‌లో పెద్దగా రాణించింది లేదు. దీంతో వరల్డ్‌కప్‌ ముంగిట అతడు మిడిల్‌ ఆర్డర్‌లో ధనాధన్‌ మెరుపుల మోత మోగిస్తేనే తుది జట్టులో ఉండగలడు. స్పిన్‌ విభాగంలో రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌లు తుది జట్టులో నిలువనున్నారు. యుజ్వెంద్ర చాహల్‌ను కాదని మణికట్టు మాయగాడు కుల్దీప్‌ యాదవ్‌ నేడు ఆడే అవకాశం ఉంది. పేస్‌ విభాగంలో మహ్మద్‌ సిరాజ్‌ ఒక్కడే ప్రపంచకప్‌ ప్రణాళికల్లో నిలకడగా ఉన్న పేసర్‌. ఉమ్రాన్‌ మాలిక్‌, జైదేవ్‌ ఉనద్కత్‌, ముకేశ్‌ కుమార్‌లు సత్తా చాటాల్సి ఉంది. బ్యాటింగ్‌ విభాగంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్‌ ఫామ్‌లో ఉన్నారు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు భారీ ఇన్నింగ్స్‌లపై కన్నేసి బరిలోకి దిగుతున్నారు.
కుర్రాళ్ల ఉత్సాహం
ఎటువంటి ప్రేరణ, లక్ష్యం లేకుండా వన్డే సిరీస్‌కు వస్తున్న కరీబియన్లు.. అగ్రజట్టుకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నారు. విండీస్‌ బ్యాటర్‌ షిమ్రోన్‌ హెట్‌మయర్‌కు భారత్‌పై మంచి రికార్డుంది. 45.55 సగటు, 121.35 స్ట్రయిక్‌రేట్‌తో అతడు టీమ్‌ ఇండియాపై 500 వన్డే పరుగులు సాధించాడు. తాజా సిరీస్‌లో అతడిని నిలువరించటం భారత్‌కు
సవాల్‌గా మారనుంది. రెండో టెస్టులో ప్రతిఘటించిన ఉత్సాహంతో కరీబియన్లు తొలి వన్డేలో పోటీపడనున్నారు. బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, హోప్‌, పావెల్‌లు జోరుమీదున్నారు.
పిచ్‌ రిపోర్టు
2022 ఆగస్టులో వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌ మూడు వన్డేలు ఇక్కడ ఆడాయి. తొలి ఇన్నింగ్స్‌లో వరుసగా 190, 212, 301 పరుగులు నమోదయ్యాయి. పేస్‌, స్పిన్‌కు పిచ్‌ నుంచి సహకారం లభించినా.. వికెట్ల వేటలో పేసర్లదే హవా నడిచింది. ఆ సిరీస్‌లో మూడు మ్యాచులు డే నైట్‌లో జరుగగా.. భారత్‌తో వన్డే పోరు ఉపఖండపు అభిమానుల టీవీ టైమింగ్స్‌కు అనుగుణంగా జరుగుతుంది. ఫింగర్‌ స్పిన్నర్లకు పెద్దగా పిచ్‌ సహకరించలేదు. మణికట్టు స్పిన్నర్లకు కాస్త మొగ్గు కనిపించవచ్చు. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునే వీలుంది.
తుది జట్లు (అంచనా)
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, సంజు శాంసన్‌/ఇషాన్‌ కిషన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌.
వెస్టిండీస్‌ : బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, కీసీ కార్టీ, షారు హోప్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), షిమ్రోన్‌ హెట్‌మయర్‌, రోవ్‌మన్‌ పావెల్‌, రొమారియో షెఫార్డ్‌, కెవిన్‌ సింక్లెర్‌, అల్జారీ జొసెఫ్‌, ఒసానే థామస్‌, జేడెన్‌ సీల్స్‌.
వర్షం సూచన!
భారత్‌, వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌లో గురువారం 20 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏదో ఒక ఇన్నింగ్స్‌కు వరుణుడు ఆటంకం కలిగించే ప్రమాదం లేకపోలేదు. రెండో వన్డే మ్యాచ్‌కు సైతం కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌ ఆతిథ్యం ఇస్తుండగా.. ఆ మ్యాచ్‌కు వర్షం కురిసే అవకాశం 50 శాతం ఉంది. వర్షం కారణంగా అధిక శాతం ఆటకు అంతరాయం ఏర్పడితే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో లక్ష్యాలను సవరించటం, ఓవర్లను కుదించటం వంటివి జరుగుతాయి. దీంతో టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునేందుకు మొగ్గు చూపవచ్చు.

Spread the love