‘మిషన్‌ భగీరథ’ కార్మికుల వెతలు పట్టవా?

Mission Bhagiratha's search for workers?

రాష్ట్ర ప్రభుత్వ మానస పుత్రికగా చెప్పిన మిషన్‌భగీరథ కార్మికుల వెతల్ని సర్కార్‌ పట్టించుకోవడం లేదు. ‘నీళ్ల కోసం ఆడబిడ్డలు మైళ్ల దూరం నడవాల్సిన పనిలేదు. ఇంటింటికీ నల్లా ద్వారా నీళ్లిస్తాం’ అని చెప్పిన ముఖ్యమంత్రి అందులో పనిచేస్తున్నవారి సమస్యలపై దృష్టి సారించడం లేదు. ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న కార్మికులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చేసిన పనికి సరైన వేతనంలేక, కుటుంబాన్ని పోషించు కోలేని స్థితిలో ఆత్మహత్యలు కూడా చేసుకున్నటు వంటి దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. అయినప్పటికీ వారి సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉన్నాయి. మిషన్‌ భగీరథలో వివిధ ఏజెన్సీల కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16వేలమంది వర్కర్స్‌ పనిచేస్తున్నారు. లైన్‌మెన్లుగా, పంప్‌ ఆపరేటర్లుగా, ఎలక్ట్రిషన్లుగా, మెయింటెనెన్స్‌ టెక్నీషియన్స్‌గా, సెక్యూరిటీ గార్డులుగా, హెల్పర్లుగా వివిధ క్యాటగిర్లలో వీరు పనిలో ఉన్నారు. ఆరు గ్రామాలకొక లైన్‌మెన్‌ చొప్పున మండలానికి ఆరు నుండి పది మంది పనిచేస్తున్న లైన్‌మెన్‌లు పనిగంటలతో నిమిత్తం లేకుండా సమస్య ఎప్పుడు వచ్చినా, ఎక్కడ వచ్చినా పైప్‌లైన్ల వెంట వెళ్లాలి. ప్రతిరోజు తనకు కేటాయించిన అన్ని గ్రామాలు తిరగాలి. వాల్వుల ద్వారా వాటర్‌ ట్యాంకులోకి నీళ్లు వదలాలి. జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం) ఫొటోలు, వీడియోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. గ్రామ పంచాయతీలకు సరఫరా చేసిన వాటర్‌ రోజువారిగా రికార్డులు చేసి, వారానికి ఒకసారి గ్రామ పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్‌, గ్రామ పంచాయతీ పంపు డ్రైవర్‌తో సంతకాలు తీసుకొని, రికార్డులుపై బాద్యులకు అప్పజెప్పాలి. ఈ రికార్డుల ఆధారంగానే కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకు బిల్లులు వస్తాయి. నీటి సరఫరా తక్కువ క్వాంటిటీ చేసినప్పటికీ ఎక్కువ మొత్తంలో సరఫరా చేసినట్లుగా పంచాయతీ సిబ్బందితో సంతకాలు తీసుకోవాలని ఏజెన్సీ బాధ్యులు లైన్‌మెన్‌లపై ఒత్తిడి తెస్తూ ఉంటారు. లేదంటే ఇస్తున్న జీతంలో కోత పెడతామని అక్కడక్కడ బెదిరిస్తున్నారు. వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, పంప్‌హౌస్లు, సంపులు తదితర చోట్ల పనిచేస్తున్న ఆపరేటర్లు, ఎలక్ట్రిషన్లు, హెల్పర్లు, సెక్యూరిటీ గార్డులు మూడు షిఫ్ట్‌లలో డే టైంలో ఆరుగంటలు, రాత్రిపూట 12గంటలు పని చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పని స్థలాలు రవాణా సౌకర్యాలకు దూరంగా ఉండటమే. ఇంత చేసినా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఏజెన్సీలు వీరికి ఇస్తున్న జీతం రూ.8 వేలనుండి 12వేలు మాత్రమే. నెలకు 30రోజులు పని చేయాలి. వారంతపు సెలవులు లేవు. పండుగ సెలవులివ్వడం లేదు. సిక్‌ లీవులు, ఎర్నుడ్‌ లీవులు అంటే ఏంటో కూడా వీరికి తెలియని పరిస్థితి. బోనస్‌, పీఎఫ్‌., ఇ.ఎస్‌.ఐ వంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు కావడం లేదు. ప్రమాద బీమా సౌకర్యం కూడా లేదు. ప్రమాదాలకు గురై చనిపోయిన పట్టించుకున్న నాథుడే లేడు. లైన్‌మెన్‌లకు బైక్‌ పెట్రోల్‌ అలవెన్స్‌లు కూడా ఇవ్వడం లేదు. పథకం ప్రారంభం నుండి అనేక కష్టనష్టాలకు ఓర్చుకొని పని చేస్తున్న క్రమంలో వీఆర్‌ఏలను రెగ్యులర్‌ చేస్తూ 3,372 మందిని హెల్పర్స్‌గా మిషన్‌ భగీరథకు కేటాయించడం జరిగింది. వీరిని గ్రిడ్‌కు కేటాయిస్తారా లేక ఇంట్రాకు కేటాయిస్తారా అనే ఆందోళన కార్మికుల్లో నెలకొన్నది. ఇక వాటర్‌ పైప్‌లైన్‌ కట్టింగులు, ఫిట్టింగులు, వెల్డింగులు, డిగింగులు తదితర పనులు నిర్వహిస్తున్నది అంతర్‌ రాష్ట్ర వలస కార్మికులు. వీరికి వసతి, భోజన సౌకర్యం కల్పించి గుండు గుత్తగా నామమాత్ర వేతనాలు ఇస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వ ఫ్లాగ్షిప్‌ ప్రోగ్రామ్‌ అయిన మిషన్‌ భగీరథ తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ుణఔూజూ) ద్వారా గ్రామీణ ప్రాంతాలకు రోజుకు తలసరి 100లీటర్లు (ఎల్‌.పి.సి.డి.), మున్సిపాలిటీలకు 135ఎల్‌.పి.సి.డి., మున్సిపల్‌ కార్పొరేషన్లకు 150ఎల్‌.పి.సి.డి., 10శాతం పారిశ్రామిక అవసరాలకు కేటాయించ బడింది. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ అందించడం ద్వారా సురక్షితమైన, స్థిరమైన పైప్‌ తాగునీటి సరఫరాను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉపరితల నీటి వనరులు గోదావరి బేసిన్‌ నుండి 53.68 టిఎంసీలు, కృష్ణా బేసిన్‌ నుండి 32.43శాతం టీఎంసీలు మొత్తం 86.11శాతం టీఎంసీలు అన్ని నీటిపారుదల వనరులలో 10శాతం నీరు తాగునీటి కోసం రిజర్వ్‌ చేశారు. నిర్మాణాలు ఇన్టేక్‌ స్ట్రక్చర్స్‌ ఇప్పటికే ఉన్న 48తో సహా 67, నీటి శుద్ధి కేంద్రాలు (ఔుూలు) ఇప్పటికే ఉన్న 103తో సహా మొత్తం 153, ప్రధాన నిర్మాణాలు ఇప్పటికే ఉన్న 505తో సహా మొత్తం 1674, ఓవర్‌ హెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్లు, ఇప్పటికే ఉన్న 17,078తో సహ మొత్తం 35,514. కాగా 50శాతం పైగా మిషన్‌ భగీరథకు ముందున్న నిర్మాణాలే అయినప్పటికీ మొత్తం మిషన్‌ భగీరథ ద్వారానే తాగునీటి సరఫరా జరుగుతున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. వినియోగదారు హక్కు (ఆర్‌ఒయు) చట్టాన్ని ఉపయోగించి నష్ట పరిహారం చెల్లించకుండానే ప్రయివేటు భూమిలో పైపులైన్లు వేశారు. మెగా ప్రాజెక్ట్ల కోసం అప్పుడు నడుస్తున్న ఇంజనీరింగ్‌, ప్రోక్యూర్‌మెంట్‌, కన్సక్షన్స్‌ (ఈపీసీ) విధానానికి బదులుగా భగీరథ ప్రాజెక్ట్‌ను ఆర్‌డబ్ల్యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ చేత డీపీఆర్‌ రూపొందించారు. 98శాతం ప్రసార, పంపిణీ వ్యవస్థలు గురుత్వాకర్షణ ద్వారా పనిచేస్తాయి. భగీరథ పనులు నిర్మాణం చేసిన కాంట్రాక్టు కంపెనీలు ఐదుసంవత్సరాల పాటు పైపులు, వాల్వులు, మోటార్లు, ఇతర వస్తువులు ఏవి చెడిపోయిన బాగుచేయవల్సిన, మార్చవల్సిన పూర్తి బాధ్యత కంపెనీలదే. పది సంవత్సరాల ఓ అండ్‌ ఎం బాధ్యత వారిదే. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అనేక జిల్లాలలో పైప్‌లైన్లు, వాల్వులు, పంపులు, మోటార్లు కొట్టుకు పోయాయి లేదా పాడైపోయాయి. గత 15రోజులుగా అనేక జిల్లాలోని పలు ఆవాసాలకు తాగు నీరందడం లేదు. పనులు నత్త నడకన నడుస్తున్నాయి. 30జిల్లాల్లోని 26విభాగాల ద్వారా 99నియోజకవర్గాలలోని 65పట్టణ స్థానిక సంస్థలు, 24,225 గ్రామీణ ఆవాసాలు కవర్‌ చేయబడతాయి (ఒఆర్‌ఆర్‌ వెలుపల). కవర్‌ చేయవలసిన మొత్తం భౌగోళిక ప్రాంతం లక్ష 11వేల చదరపు కిలోమీటర్లు. ప్రయోజనం పొందే జనాభా 2కోట్ల 72లక్షలు. కవర్‌ చేయబడిన లేదా కవర్‌ చేయబడే మొత్తం కుటుంబాలు 65,29,770. గ్రామీణ కుటుంబాలు 52,47,225, పట్టణ గృహాలు 12,82,545. మొత్తం పైప్‌లైన్‌ నెట్వర్క్‌ 1.697లక్షల కి.మీ. విద్యుత్‌ వినియోగం 235మెగా వాట్లు. ప్రాజెక్ట్‌ అంచనా విలువ రూ.43,791 కోట్లు కాగా 36,900 కోట్లు మాత్రమే ఖర్చు చేయబడిందని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ వివిధ కారణాల వలన ఇప్పటికీ 10 నుండి 15శాతం నిర్మాణ పనులు పూర్తి చేయలేదు. క్యాపిటల్‌ ఫండ్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది 10శాతం మాత్రమే. మిగతా డబ్బులు బ్యాంకులు, నాబార్డ్‌ నుండి లోన్లు తీసుకున్నారు. ఈ అప్పులు 12సంవత్సరాల లోపు రీపేమెంట్‌ 48ఇన్‌స్టాల్‌మెంటులో చెల్లించాలి. ఇప్పటికే ఆరు సంవత్సరాలు పూర్తయింది. ఇంకో రెండు సంవత్సరాల్లో ఇన్‌స్టాల్‌మెంట్లు, చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. మిషన్‌ భగీరథకు కేంద్ర ప్రభుత్వం 19,205 కోట్ల రూపాయలను ఇవ్వాలని నిటి అయోగ్‌ రికమండ్‌ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇంత ఖర్చు చేసినప్పటికీ వివిధ జిల్లాలలోని మారుమూల గ్రామాలకు, కొండ ప్రాంతాల్లోని గ్రామాలకు మిషన్‌ భగీరథ తాగునీరు అందడం లేదు. అనేక గ్రామాలకు పైప్‌లైన్లు కూడా వేయలేకపోయారు. మిషన్‌ భగీరథ ద్వారా అందుతున్న తాగు నీరు 40 నుండి 50శాతం మాత్రమే. మిగతా వాటర్‌ ఇదివరకే ప్రారంభించి నడుస్తున్న తాగునీటి పథకాలు, గ్రామ పంచాయతీ లోని బోర్లు, బావులు, పట్టణ ప్రాంతాలలో ఇతర సాగునీటి పథకాల ద్వారా అందుతున్నవే. కానీ రాష్ట్ర మొత్తంలో తాగునీరు మిషన్‌ భగీరథ ద్వారానే అందుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచార పొటాటోపం చేసుకుంటున్నది.
రాష్ట్ర ప్రభుత్వం తన మానస పుత్రికగా భావిస్తున్న మిషన్‌ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కరించకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలదా! ఇప్పటికే వివిధ జిల్లాల్లో ముఖ్యంగా నల్లగొండ, సంగారెడ్డి జిల్లాలో భగీరథ కార్మికులు ఐక్యమై సమ్మెలు, పలు ఆందోళనలు చేసి కొన్ని సమస్యలు పరిష్కరించు కున్నారు. పది సంవత్సరాల వరకు నిర్మాణ, నిర్వహణ బాధ్యత ఏజెన్సీలదే అయినప్పటికీ కార్మికుల వేతనాలు, సౌకర్యాల నిమిత్తం కె.ఎల్‌ (1000 లీటర్ల)కు రూ.1.50 పైసలు రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీలకు ఇస్తున్నది. కానీ కార్మికులకు చట్టబద్ధ వేతనాలు, సౌకర్యాలు ఇప్పించడంలో విపులమవు తున్నది. ఏజెన్సీలపై తగు చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య పోరాటాలకు సిద్ధమవుతున్నారు.

గీట్ల ముకుందరెడ్డి
9490098857

Spread the love