తప్పులు చేసి ఉండొచ్చు

PM Modi makes podcast debut– మనిషినే..దేవుడిని కాను : నిఖిల్‌ కామత్‌ పాడ్కాస్ట్‌లో మోడీ
న్యూఢిల్లీ: జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ పాడ్కాస్ట్‌ (పాడ్కాస్ట్‌ అంటే డిజిటల్‌ ఆడియో ఫైల్‌. దీనిని ఇంటర్నెట్‌ లేదా ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని ఎప్పుడైనా వినవచ్చు) తదుపరి ఎపిసోడ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ అతిథిగా హాజరవుతారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను గురువారం సాయంత్రం విడుదల చేశారు. నాయకత్వం, తన పదవీకాలం, అంతర్జాతీయ వ్యవహారాలు, రాజకీయాలపై ఈ ఎపిసోడ్‌లో కామత్‌తో ప్రధాని మోడీ ముచ్చటించడం కన్పించింది. ‘ప్రధానితో ప్రజలు’ శీర్షికన రూపొందించిన పాడ్కాస్ట్‌లో మోడీతో కామత్‌ అరుదైన సంభాషణ జరిపారు. ‘పాడ్కాస్ట్‌లో పాల్గొనడం నాకు ఇదే మొదటిసారి’ అని మోడీ అంగీకరించారు.అంతర్జాతీయ ఉద్రిక్తతలు, జరుగుతున్న యుద్ధాలపై భారత్‌ వైఖరి వంటి అంశాలను మోడీ ప్రస్తావించారు. ‘ఈ సంక్షోభంలో మేము తటస్థులం కాదని పదేపదే చెప్పాము. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను. నేను శాంతి వైపే ఉంటాను’ అని ఆయన అన్నారు. ఎపిసోడ్‌కు సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూ త్వరలోనే కామత్‌ ఛానల్‌లో కన్పిస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చేసిన ఓ ప్రసంగాన్ని మోడీ పాడ్కాస్ట్‌లో ప్రస్తావించారు. ‘తప్పులు అనేవి అనివార్యం. నేను కూడా తప్పులు చేసి ఉండవచ్చు. నేను మానవ మాత్రుడిని. దేవుడిని కాను’ అని వ్యాఖ్యానించారు. మోడీ 2.0 కంటే మోడీ 1.0 ఎలా భిన్నమైనదని కామత్‌ ప్రశ్నించగా ‘మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు నన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. నేను కూడా ఢిల్లీని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించా’ అని మోడీ అన్నారు. రాజకీయ నాయకులు కావాలని కోరుకుంటున్న వారికి సలహా ఇస్తూ ‘ప్రజలు ఒక సంకల్పంతో ముందుకు రావాలే తప్ప కోరికతో కాదు’ అని చెప్పారు. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తూనే ఉండాలని మోడీ సలహా ఇచ్చారు.

Spread the love