మొరాయించిన ఈవీఎం.. ఓటేయకుండానే వెనుతిరిగిన మిజోరం సీఎం

నవతెలంగాణ- ఐజ్వాల్‌: ఈశాన్య రాష్ట్రంలో మిజోరంలో ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఓటేయడానికి వచ్చిన మిజో నేషనల్‌ ఫ్రంట్‌  చీఫ్‌, ముఖ్యమంత్రి జొరాంతంగకు చేదు అనుభవం ఎదురైంది. ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే సీఎం జొరాంతంగ తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఐజ్వాల్‌లోని వైఎంఏ పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. అదే సమయంలో ఈవీఎం మెషిన్‌ మొరాయించింది. దీంతో కొద్దిసేపు పోలింగ్‌ కేంద్రంలోనే వేచిచూసిన ఆయన.. మిషిన్‌ పనిచేయడం లేదని అధికారులు చెప్పడంతో అక్కడి నుంచి వెనుతిరిగారు. టిఫిన్‌ చేసిన తర్వాత ఓటేసేందుకు మళ్లీ వస్తానని చెప్పారు. ఈవీఎం పనిచేయడం లేదని, దీంతో ఓటేయకుండానే తాను వెళ్లిపోతున్నాని మీడియాతో అన్నారు. ఈ ఎన్నికల్లో తాము పూర్తిస్థాయి మెజార్టీ సాధిస్తామని, మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. హంగ్‌ వచ్చే అవకాశం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 21 స్థానాలు అవసరమని, తమకు 25 సీట్లు వస్తాయన్నారు. రాష్ట్రంలో బీజేపీతో ఎలాంటి పొత్తూ లేదని స్పష్టం చేశారు. తాము కేంద్రంలోని ఎన్డీయేలో భాగంగా ఉన్నామని, రాష్ట్రంలో బీజేపీతో ఎలాంటి భాగస్వామ్యం లేదన్నారు. రాష్ట్రంలో కూడా ఎన్డీయేకు అంశాలవారీగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు.

Spread the love