ఆర్మూర్ పట్టణం అభివృద్ధికి నిలువుటద్దం.. ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి

నవతెలంగాణ- ఆర్మూర్:  పట్టణం అభివృద్ధికి నిలువుటద్దమని బీఆర్ఎస్ అభ్యర్థి, ఆ పార్టీ  జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం  పట్టణంలోని 4,21,5,6,7 వార్డుల్లో  పెద్ద ఎత్తున ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ నిర్వహించిన జీవన్ రెడ్డి ఇంటింటికి వెళ్లి మళ్లీ బీఆర్ఎస్ ను గెలిపించాలని  కోరుతూ ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనకు ఈ వార్డుల్లో  ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. డప్పు, వాయిద్యాలు,మేళ తాళ్లాలతో ప్రజలు మంగళ హారతులు పట్టారు. మహిళలు బోనాలతో, యువకులు బైక్ ర్యాలీలతో కేరింతలు కొడుతూ తమ అభిమాన నేతను ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ ఆయా వార్డుల  ప్రగతి నివేదికలను ప్రజల ముందు ఉంచి ఇన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇచ్చింది కేసీఆర్, తెచ్చింది నేను. అవునా?, కాదా? అని ప్రజలను అడిగారు.  ఆర్మూర్ పట్టణం గత పాలకుల హయాంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఒక మురికి కూపంలా ఉండేది. గత తొమ్మిదేళ్లుగా అభివృద్ధి పథంలో పరుగులు పెడుతూ ప్రగతికి చిరునామాగా మారింది. ఇంత అభివృద్ధిని ఏనాడైనా చూసామా? రోడ్లు లేని వార్డు ఉందా?, మంచినీళ్లు రాని ఇల్లుందా?. ఏ వార్డులో చూసిన రోడ్లు తళతళ మెరుస్తున్నాయి. డ్రైనేజీలున్నాయి. పరిశుభ్రత, పచ్చదనంతో పట్టణం కొత్త అందాలు సంతరించుకుంది. తొమ్మిదికి పైగా నిర్మించిన బైపాస్ రోడ్లు ఆర్మూర్ ప్రగతికి సోపానాలుగా మారాయి. అన్ని సామాజిక వర్గాలకు ఫంక్షన్ హాళ్ల నిర్మాణం  చేస్తున్నాం. గౌరవ సీఎం కేసీఆర్ గారి దయ వల్లే ఆర్మూరుకు వందపడకల ఆసుపత్రి వచ్చి ప్రజలందరికీ వైద్యం చేరువైంది అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. పెర్కిట్ చెరువు, రెడ్డిచెరువుల్లో  కాలుష్యానివారణ పనులు,  మోడ్రన్ ధోబీఘాట్, గుండ్లచెరువు టూరిజం అభివృద్ధి పనులు, వెజ్-నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం పనులు,  కోట్లాది రూపాయల వ్యయంతో ఆర్మూర్ పట్టణంలో సిద్ధులగుట్ట ఘాట్ రోడ్డు, ఆలూరు, ఆర్టీసీ బైపాస్ రోడ్లు, అంబేద్కర్ చౌరస్తా అందాలు, డివైడర్లు, అన్ని కుల సంఘాల భవనాల నిర్మాణానికి నిధులు, ఆర్మూర్ పట్టణమంతా రోడ్ల నిర్మాణం వంటి కార్యక్రమాల గురించి ఆయన  ప్రముఖంగా ప్రస్తావించిన్నప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చింది కేసీఆర్, తెచ్చింది జీవనన్న అంటూ ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. “మీ వార్డుల్లో మిషన్ భగీరథ మంచినీళ్లు క్రమం తప్పకుండా వస్తున్నాయా?. నీళ్ల ట్యాంకులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్నారా?. పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయా?.  కళ్యాణ లక్ష్మీ పథకం కింద డబ్బులు సక్రమంగా వస్తున్నాయా?.
ఇండ్లపై నుంచి విద్యుత్ తీగలు పోకుండా విద్యుత్ లైన్లు సురక్షిత ప్రాంతాలకు మార్చినం. రోడ్లపై ప్రజలకు ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను వేరే చోటుకు షిఫ్ట్ చేశాం. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు, అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు చేరితేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఒక్క పది రోజులు ఓపిక పట్టండి. నేనే మళ్లీ గెలుస్తున్న. మళ్లీ మన ప్రభుత్వమే వస్తున్నది. అన్ని  సమస్యలు పరిష్కరించుకుందాం. మీ వార్డుల్లో ఇంకా ఏమైనా సమస్యలుంటే చెప్పండి. పది రోజుల్లో పరిష్కారిస్తా. అవసరమైన నిధులు మంజూరు చేస్తా.
అభివృద్ధి పనులు ముమ్మరంగా జరగాలి. పెండింగ్ పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. పట్టణంలో పారిశుధ్యం, పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.  స్వచ్చ బుధవారం ప్రోగ్రాం ను చిత్తశుద్ధితో నిర్వహించాలి. మన అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమాలపై ప్రజల్లో  విస్తృతంగా చర్చ జరగాలి. కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు గడప గడపకూ వెళ్లి అభివృద్ధిపై  ప్రచారం చేయాలి. ఈ ఎన్నికల్లో  గెలుపు మనదే  కావాలి అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రక్షకుడు కేసీఆరే. బీఆర్ఎస్ తోనే సమగ్ర ప్రజా రాజ్యం సాధ్యమవుతుంది. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరువు కాటకాలు, కర్ఫ్యూలు, అవినీతి, అరాచకం, రౌడీయిజంతో ప్రజల బతుకులు నాశనం కావడం ఖాయం. బీజేపీ వస్తే ప్రజల మధ్య మతం చిచ్చు, అబద్ధాల రొచ్చుతో సమాజాన్ని సర్వనాశనం చేస్తారు.
ఓటేసి ముందు ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెసు సృష్టించే సంక్షోభం వద్దు. బీఆర్ ఎస్ ఇచ్చే సంక్షేమం ముద్దు. కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ మనకొద్దు. కేసీఆర్ గారిచ్చే 24గంటల ఉచిత విద్యుతే మనకు కావాలి.. కాంగ్రెస్ అవినీతి, అరాచక పాలన మనం భరించలేం. సబ్బండ వర్గాల అభ్యున్నతికి పాటుపడే బీఆర్ ఎస్ మనకు కావాలి. రైతును రాజును చేసిన కేసీఆర్ గారి పాలనే మనకవసరం.  పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేసే కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్  పథకాలు మనకు కావాలి.ఈ పథకాలను రద్దు చేయాలని చూస్తున్న కాంగ్రెస్, బీజేపీ లనే మన ఓటు ద్వారా రద్దు చేద్దాం. ఆర్మూర్ అభివృద్ధి రథం మరింత వేగంగా పరుగులు పెట్టాలంటే మనం కారు గుర్తుకు ఓటేద్దాం. తెలంగాణ కు ఎలాంటి కష్టం రావద్దంటే ఊరూ వాడ ఏకమై మూడోసారి కూడా ” కారు, సారు, కేసీఆర్” అని కదం తొక్కాలి. అర్మూర్ నియోజకవర్గమంతా ఒక్కటై నన్ను దీవించండి.
ప్రజాభిమానంతో..
మళ్లీ గెలుపు నాదే. నాకు హ్యాట్రిక్ విజయం చేకూర్చి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలని మీకు మరోమారు వినమ్రంగా పాదాభివందనం చేస్తూ ఆర్థిస్తున్న అని జీవన్ రెడ్డి అన్నారు.
 ఆర్మూర్ నియోజకవర్గం 2014కు ముందు ఎట్లుందో, ఇప్పుడెట్లుందో మీరే బేరీజు వేసుకోండి. అభివృద్ధిపై ప్రతీ ఇంట చర్చ జరగాలి. 3వేల కోట్ల రూపాయలతో ఆర్మూర్ నియోజకవర్గాన్ని  అభివృద్ధి చేశా. ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక్క విద్యుత్ సబ్సీడీలే రూ.320కోట్లు వచ్చాయి. నియోజకవర్గంలో 62 వేల మందికి రూ.2016, రూ.4016 చొప్పున ఆసరా పెన్షన్లు అందుతున్నాయి.  ఈ పథకం ద్వారా తెలంగాణలోని వృధ్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడి కార్మికులు, హెచ్.ఐ.వి. – ఎయిడ్స్ ఉన్నవారు లబ్ధి పొందుతున్నారు. దేశంలోనే బీడి కార్మికులకు ఆసరా పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 62 వేల మందికి రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందుతోంది. అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ చౌరస్తాలను సుందరీకరించాం. 12వందల మందికి దళితబంధు స్కీమ్ ద్వారా ద్వారా రూ. 10 లక్షల చొప్పున వచ్చి వారికిష్టమైన యూనిట్లు పెట్టుకొని ఆత్మ గౌరవ పతాకను ఎగురేస్తున్నారు. మరో 11వందల మందికి దళిత బంధు ఇవ్వబోతున్నాం.
కేసీఆర్ సర్కారుకు సకల కులాలూ సమానమే..
ఆర్మూర్ లో వివిధ కులాలకు 17 ఫంక్షన్ హాళ్ల నిర్మాణం చేస్తున్నాం. గృహలక్ష్మీ ద్వారా 3వేల ఇండ్ల నిర్మాణం చేపడతాం. 4వేల మందికి కొత్తగా ఇండ్ల స్థలాలుపంపిణీ చేస్తాం. సిద్ధులగుట్ట కు రూ. 20కోట్లతో ఘాటు రోడ్డు వేయించా. సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశా. సిద్ధులగుట్టను దేశంలోనే అధ్బుతమైన మహిమాన్విత దివ్య క్షేత్రంగా, పర్యాటక స్థలంగా తీర్చి దిద్దా.రూ. 120 కోట్లతో పంచగూడ వంతెన కట్టించి నిజామాబాద్-నిర్మల్ జిల్లాల మధ్య దూరం తగ్గించా. నియోజకవర్గమంతా రూ. 500 కోట్లతో రోడ్లు వేయించా. ఆర్మూర్- నిజామాబాద్, నిజామాబాద్- మాక్లూర్ కు రోడ్లు నిర్మించా. ఆర్టీసీ, ఆలూరు, వెల్మల్, నందిపేట్ సహా తొమ్మిదికి పైగా బైపాస్ రోడ్లు వేయించా. మారంపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఉంది. ఆర్మూర్ కు వంద పడకల ఆసుపత్రి సాధించి ఆధునిక వైద్యాన్ని గడపగడపకూ చేరువచేశా. ఈ దవాఖానలో ఇప్పటికే 25 వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగి కేసీఆర్ కిట్లు అందించాం. ఉచిత ప్రసవాల వల్ల ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున ఖర్చు తప్పింది. అనారోగ్యంతో బాధపడుతున్న 25వేల మందికి పైగా సీఎం ఆర్ ఎఫ్ నిధులు మంజూరు చేయించా. మరో అయిదు వేల మందికి
 ఎల్ వోసీ చెక్కులు ఇప్పించి వారి ప్రాణాలు కాపాడా. నా దగ్గరకు వచ్చి అడిగిన వెంటనే ప్రయివేటు ఆసుపత్రులలో డిస్కౌంట్ ఇప్పించా.
ఆర్మూర్ ను రెవెన్యూ డివిజన్ గా మార్చా..
కొత్తగా డొంకేశ్వర్, ఆలూరులను మండలాలుగా మార్పించా. గొల్ల, కురుమ సోదరులకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయించా. రైతుబీమా వస్తోంది. 450 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొత్తం నియోజకవర్గంలోని 81 గ్రామాలకు, 36 వార్డులకు ఇంటింటికీ మిషన్ భగీరధ  మంచి నీళ్లు సరఫరా చేస్తున్నాం.   గురుకుల పాఠశాలల్లో ఏడాదికి ఒక్కొక్క విద్యార్థికి ఒక లక్షా 25వేల రూపాయల చొప్పున ఖర్చు చేస్తూ ఇంగ్లీషు మీడియంలో విద్య నేర్పిస్తున్నాం. రూ. 120కోట్లతో పత్తేపూర్-చేపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సాధించా. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ద్వారా ఒక లక్షా 116 రూపాయల చొప్పున ఇస్తూ 15వేల నుంచి 20వేల మంది పేదింటి ఆడ పిల్లల పెండ్లిండ్లు జరిపించాం. గుండ్ల చెరువు ట్యాంక్ బండ్ ను అభివృద్ధి చేశా. నాయీ బ్రాహ్మణ, రజక సోదరులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. 15 కులవృత్తుల వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయమందించబోతున్నాం. అంబేద్కర్ స్పూర్తితో కేసీఆర్ గారి పాలన సాగుతోంది అని అన్నారు.
 నేడు ఆర్మూర్ ఒక సుందర పట్టణం.
విశాలమైన రోడ్లు, అధునాతన డ్రైనేజీలతో ప్రజల కష్టాలు తొలిగిపోయాయి. అని ప్రతీ రోజు చెత్తను, మురికిని నిర్మూలించి పరిశుభ్రంగా ఉంచుతున్నాం. మిషన్ భగీరధ ద్వారా పరిశుభ్రమైన మంచినీటి సరఫరా జరుగుతోంది. అని  ఎల్ ఈడీ లైట్ల కాంతిలో పట్టణం దేదీప్యమానంగా వెలిగిపోతోంది అని పట్టణంలో  రహదారులు తలతళలాడుతున్నాయి అని అన్నారు.
చుట్టూ వేసిన బైపాస్ రోడ్లు ఆర్మూర్ మెడలో మణిహారాలుగా మెరుస్తున్నాయి. రోడ్లపై గుంతలు, బొందలు, గోతులు లేవు. పచ్చదనంతో పట్టణం కళకళలాడుతోంది  చెత్త నిర్మూలనకు పెర్కిట్ లో డంప్ యార్డులు ఏర్పాటు చేశాం.  చనిపోయిన వారిని గౌరవంగా సాగనంపేందుకు వైకుంఠ దామాలు నిర్మించాం. పట్టణ జనాభా ప్రకారం రూ.7.20 కోట్లతో పరిశుభ్రమైన వెజ్-నాన్ వెజ్- ఫ్రూట్, ఫ్లవర్ మార్కెట్లు నిర్మిస్తున్నాం. పట్టణంలోని యువతకు  క్రీడా ప్రాంగణాలు నిర్మించాం. ఆర్మూర్ అర్బన్ పార్క్ తో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాం. ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేశాం అని అన్నారు. పట్టణ ప్రజలకు, పట్టణానికి వచ్చే ప్రజలకు అవసరమైనన్ని పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాం. వంగిన స్తంభాలు, తుప్పు పట్టిన స్తంభాలు, రోడ్డు మధ్యలోని స్తంభాలు, ఫుట్ పాత్ లపై ఉండే ట్రాన్స్ ఫారాలను సురక్షిత ప్రాంతాలకు మార్చాం. ఇండ్లపై వేలాడే వైర్లను సరిచేసాం.పాడుబడ్డ బావుల పూడ్చివేత,  శిథిలావస్థకు చేరిన ఇండ్ల కూల్చివేత కార్యక్రమాన్ని పూర్తి చేశాం అని పట్టణానికి అవసరమైనన్ని నర్సరీలను ఏర్పాటు చేసాం. ప్రతీ ఇంటికి తడి, పొడి చెత్త వేయడానికి బుట్టలు పంపిణీ చేసాం అని  ఇండ్ల నుంచి చెత్త సేకరణకు అవసరమైనన్ని వాహనాలు సమకూర్చాం అని సిద్ధులగుట్ట కు ఘాట్ రోడ్డు వేయడం వల్ల ఆర్మూర్ కు ఆధ్యాత్మిక శోభ, పర్యాటక కళ వచ్చింది అని అన్నారు. పట్టణంలోని రోడ్లకు ఇరు వైపులా డివైడర్లు నిర్మించి సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశాం.
అంబేద్కర్ చౌరస్తాను సుందరీకరించాం.. ఎటుచూసినా ఆకుపచ్చ ఆర్మూరే
ఇవి  ఏదో అధికార మార్పిడి కోసం జరిగే సాదాసీదా ఎన్నికలు కావు. ఇవి తెలంగాణ ఆత్మ గౌరవానికి, ఢిల్లీ పెద్దల అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. పదేళ్లుగా అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ పచ్చదనాన్ని నాశనం చేసేందుకు దాడికి వస్తున్న కాంగ్రెస్, బీజేపీ మిడతల దండుతో మన పోరాటం.  తెలంగాణ నాశనాన్ని కోరుకుంటున్న ఢిల్లీ గద్దలతో మనం ధర్మయుద్ధం చేస్తున్నాం. కాంగ్రెస్, బీజేపీలలో ఏదొచ్చిన మన 450 అభివృద్ధి, సంక్షేమ పథకాలు కానరాకుండా పోతాయి.  కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకుంటూ సంపద పెంచి పేదలకు పంచాలని, అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ను అగ్రగామిగా నిలపాలని బీఆర్ఎస్ ఎన్నికల బరిలోకి వస్తోంది. తెలంగాణ గడ్డపై పుట్టిన ముద్దు బిడ్డలారా?. ఆలోచించండి. అర్థం చేసుకోండి. మనం ఏ మాత్రం పొరపాటు చేసినా పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ తెలంగాణ ద్రోహులు,గుంట నక్కల పాలై మన బతుకులు బానిసత్వం పాలయ్యే ప్రమాదం పొంచి ఉంది.  ఆర్మూర్ నియోజకవర్గం ప్రజలు కలలో కూడా చూడని అభివృద్ధిని ఈ పదేళ్ళలో చూసారు. ప్రజలు అసాధ్యమనుకున్నవి నేను సుసాధ్యం చేసి చూపించా.  గత ప్రభుత్వాల హయాంలో ఆర్మూర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన హేమాహేమీలు చేయలేని పనులివి. ఇలాంటి అసాధ్యమనుకున్న పనులను సుసాధ్యం చేసిన నన్ను మళ్లీ దీవించండి. మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్లు రూ.5 వేలకు, వికలాంగుల పెన్షన్లు రూ.6వేలకు, రైతు బంధు నిధులు ఎకరాకు రూ.10వేల నుంచి రూ.16వేలకు పెరుగుతాయి. సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ. 3వేల భృతి వస్తుంది. రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా జరుగుతుంది. రూ.5లక్షల చొప్పున ఇంటింటికి బీమా కేసీఆర్ ధీమా పథకం అమలు కానుంది. కేసీఆర్ పాలనలోనే మనకు న్యాయం జరుగుతుంది అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ ,పండిత్ పవన్ ,డాక్టర్ మధు శేఖర్ ,కౌన్సిలర్లు ఇట్టిడి నర్సారెడ్డి,, చాలా ప్రసాద్, లిక్కీ శంకర్, సొసైటీ చైర్మన్ పెంటా భోజరెడ్డి, నూనె నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love