ఆర్టీసీ విలీనానికి బీజేపీ వ్యతిరేకం కాదు..: ఎమ్మెల్యే ఈటల

BJP not against RTC merger, MLA Etalaనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి బీజేపీ ఎంత మాత్రం వ్యతిరేకం కాదని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తెలిపారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ… ఈ విషయంలో ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. గవర్నర్‌ లేని సమయంలో బిల్లు పంపి ఆమోదించడంలేదంటూ విమర్శించటమేంటని ప్రశ్నించారు. ఈ రకంగా బట్ట కాల్చి మీద వేస్తున్నారని వాపోయారు. ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు ఇవ్వలేదని తెలిపారు. వారి గుండెల్లోని బాధను మర్చిపోలేమన్నారు. మహిళా కండక్టర్లకు ఇష్టం లేకపోయినా రాజ్‌భవన్‌ వద్ద ధర్నాకు పంపుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహిస్తున్నదని విమర్శించారు. ప్రజల కోసం సమావేశాలు జరగడం లేదని.. తమ వైపు స్పీకర్‌ కన్నెత్తి చూడటం లేదని చెప్పారు. తాము మాట్లాడితే ఒక వైపు హరీష్‌రావు, కేటీఆర్‌ దాడి చేస్తున్నారని విమర్శించారు. గ్రామ పంచాయితీ సిబ్బంది జీతాలు రాక ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు.

Spread the love