– 220 కెవి సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాద ఘటన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లాను
– ఫైర్ , విద్యుత్ సిబ్బంది మూడు గంటల కృషి ఫలితంగా మంటలు తగ్గాయి
– ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ – సిద్దిపేట
పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద గల 220 కెవి సబ్ స్టేషన్ లో బుధవారం సాయంత్రం సుమారు 6:30 సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో సిద్దిపేట నియోజకవర్గం తో పాటు దుబ్బాక లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా లేక అంధకారంగా మారింది. ఘటన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆపే వరకు విద్యుత్ అధికారులను, ఫైర్ సిబ్బందిని కి సూచనలు ఇస్తూ, పర్యవేక్షించారు. సుమారు మూడు గంటలు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ విషయం తెలవగానే ఏడున్నర గంటల సమయంలో ఘటన స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. మార్గమధ్యంలోనే ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు సమాచారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ డైరెక్టర్, విజిలెన్స్ అధికారులకు కూడా సమాచారం అందించానని తెలిపారు. 220 కెవి సబ్ స్టేషన్ పరిసరాలలోనే 132 కెవి సబ్ స్టేషన్, ఇతర సబ్ స్టేషన్ లు ఉన్నాయని, కానీ భారీ ప్రమాదం తప్పిందని అన్నారు. సంఘటనను చూసి ఆందోళనకు గురయ్యానని, ఫైర్ సిబ్బంది ,విద్యుత్ అధికారుల కృషి ఫలితంగా మంటలు అదుపు7లోకి వచ్చినట్లు తెలిపారు. హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేటకు చెందిన నాలుగు ఫైర్ ఇంజన్ లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయని తెలిపారు. పట్టణం నడిబొడ్డున సబ్స్టేషన్ ఉందని, ఎలాంటి ప్రమాదం జరగకపోవడం తో ఊపిరి పీల్చుకున్నట్లు తెలిపారు. ఘటనపై విచారణ జరిపించాలని అధికారులను కోరారు. సిద్దిపేట మున్సిపల్ అధికారులు కూడా సహాయక చర్యలు చేపట్టారని, విద్యుత్ , ఫైర్ సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నట్లు తెలిపారు. దుద్దెడ ,జక్కాపూర్, హబ్సిపూర్, పాలమకుల 132 కెవి సబ్ స్టేషన్ ల నుండి విద్యుత్ సరఫరా లేని ప్రాంతాలకు విద్యుత్ పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.
అధికారుల సమిష్టి కృషితో మంటలు అదుపులోకి: విద్యుత్ శాఖ అధికారులు, ఫైర్ సిబ్బంది ,మున్సిపల్ సిబ్బంది కృషి ఫలితంగా 220 కెవి సబ్ స్టేషన్ లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి. పోలీసులు ఘటన స్థలంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రజలను అక్కడి నుండి పంపిస్తూ, సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకున్నారు.