– బెల్లంపల్లి ఎమ్మెల్యే లైంగికంగా వేధించారు.. అతనిపై కేసు నమోదు చేయాలి
– ఢిల్లీ తెలంగాణ భవన్ లో బాధితురాలి దీక్ష
న్యూఢిల్లీ: తనను లైంగికంగా వేధించిన కామ పిశాచి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద తక్షణమే కేసు నమోదు చేయాలని బాధితురాలు షేజల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడిక్కడ తెలంగాణ భవన్ లో షేజల్ నిరవధిక దీక్షకు దిగారు. న్యాయ దీక్ష జరుగుతుందని షేజల్ అన్నారు. ఆరిజిన్ డైరీ ప్లాంటు నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని చూపించి తమ వద్ద రూ. 30 లక్షలు తీసుకుని మమ్మల్ని కుట్ర పూరితంగా మోసం చేసిన చిన్నయ్యను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 11 నుంచి 13 వరకు తమను కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే, ఆయన అనుయాయులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే దగ్గరికి రాత్రి సమయంలో వెళ్లాలని తనను బలవంతం చేశారని, అందుకు నిరాకరించడంతో తన మీద, తన తమ్ముడు మీద తప్పుడు కేసులు నమోదు చేసిన సీఐ బాబురావు, ఎస్‌ఐ ఆంజనేయులు, ఎస్‌ఐ రాజశేఖర్ లను తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేయాలని, వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ 404లో జరిగిన లైంగిక దాడితో పాటు ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో కామ క్రీడలు సాగించిన ఎమ్మెల్యేపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరపాలని కోరారు. సీసీటీవీ ఫుటేజ్ ను బయట పెట్టాలని, తెలంగాణ ప్రజలకు ఎమ్మెల్యే చిన్నయ్య నిజ స్వరూపం తెలియజేయాలని అన్నారు. ఎమ్మెల్యే అండతో బెల్లంపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లోనే తమ కారు టైర్లు గాలి తీసి తమను చంపేందుకు ప్రయత్నించారని, సోషల్ మీడియాలో, వాట్సాప్ కాల్స్ లో తనను యాసిడ్ పోసి చంపుతానని బెదిరించిన ఎమ్మెల్యే అనుచరులు సీపతి రమణ, చిల్లరపు సంతోష్, కుమ్మరి పోచన్నా, కోనాంకి కార్తీక్, భీమా గౌడ్, గోలి శివ, సున్నం రాజుల మీద చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సంస్థ మీద తప్పుడు కేసులు నమోదు చేయడం వల్ల నష్టపోయిన బాధితుల్ని తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆదుకోవాలని, తమ జీవితాలు రోడ్డుపైకి రావడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.