ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో నేతలపైనే దుష్ప్రచారాలు చేసే దరిద్రం దాపరించిందన్నారు. ఇంత బతుకు బ్రతికి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తానని అనుకోలేదన్నారు. పార్టీలో నాలుగేళ్ళ నుంచి తనపై ప్రచారం జరుగుతోందని… పార్టీ కోసం ఎంత చేసినా తనను ప్రశ్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో ఎందుకు ఈ పరిస్థితి ఉందో అర్థం కావడం లేదన్నారు. మీడియా అడిగేదాంట్లో తప్పు లేదని తెలిపారు. అగ్రనేత రాహుల్ గాంధీకి అన్ని విషయాలు నిశితంగా వివరిస్తానని చెప్పుకొచ్చారు. ఎన్నికల వ్యూహాలపై రాహుల్ గాంధీ పిలిచారన్నారు. ‘‘నేను పైరవికారుణ్ణి కాదు.. వాళ్ళు పిలిస్తేనా వచ్చా. పార్టీ ఐక్యంగా ఉందో లేదో నేను చెప్పలేను… నేను చెప్పే వాడిని కూడా కాదు.. పార్టీ ఐక్యంగా ఉందో లేదో రాహుల్ గాంధీకి చెబుతా’’ అంటూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. కాగా.. తెలంగాణలో పలువురు ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరనున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితులపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారాయి.

Spread the love