నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ అబద్దాలు చూసి గోబెల్స్ కూడా సమాధి నుంచి తలదించుకుంటున్నారని చెప్పారు. 60 ఏళ్ల పాటు తెలంగాణను గోస పెట్టి, వేల మందిని క్రూరంగా చంపిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను, హక్కులను, వనరులను దోచుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలని ఆరోపించారు. ఇప్పటికే జల వనరులను తాకట్టు పెట్టిన రేవంత్, సింగరేణి ప్రైవేటీకరణకు బీజేపీకి సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. గతంలో అడ్డగోలుగా తెలంగాణ గనులను రెండు కంపెనీలకు బీజేపీ కేటాయించినా, బీఆర్ఎస్ వ్యతిరేకించడం వల్లనే అక్కడ మైనింగ్ ప్రారంభం కాలేదని అన్నారు. కానీ ఈరోజు గనుల వేలానికి కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని అన్నారు. రేవంత్ చెప్పిన రెండు కంపెనీలు గతంలో కాంగ్రెస్, శివసేన ప్రభుత్వ హయాంలో మహారాష్ట్రలో గనులు దక్కించుకున్నాయని కేటీఆర్ తెలిపారు.