మల్లాయిగూడెం లో పర్యటించిన ఎమ్మెల్యే మెచ్చా..

– ధ్వంసం అయిన గృహాలు పరిశీలన, క్షతగాత్రుల పరామర్శ..
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలో ఆదివారం సంభవించిన గాలివాన బీభత్సానికి మల్లాయిగూడెం లో ధ్వంసం అయిన ఇళ్ళను,పొగాకు బ్యారెన్, క్షతగాత్రులను సోమవారం స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పరిశీలించి, పరామర్శించారు. ఆయన వెంట ఉన్న తహశీల్ధార్ లూదర్ విల్సన్ తో నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. బారేన్ వద్ద గాయాలు అయిన ఇద్దరినీ ఇంటికి వెళ్లి పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించి వైద్యం నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. గ్రామస్థులు డబుల్ బెడ్ రూం లు కావాలని కోరడంతో ప్రభుత్వం వచ్చే నెలలో గృహలక్ష్మి పథకం ద్వారా రూ. 3 లక్షలు ఇస్తుందని, అర్హులందరికీ వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. మళ్ళాయి గూడెం – అనంతారం వెళ్ళే మార్గం తారు రోడ్డు కావాలని కోరడం తో వెంటనే ఐటిడిఎ ఎ.ఇ ప్రసాద్ ఫోన్ చేసి అంచనా వేసీ ఇవ్వాలని ఆదేశించారు. మంత్రి అజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్ళి, ఐటిడిఎ పి.ఒ తో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. అలాగే మంచి నీరు త్వరగా అందించాలని, కరెంట్ కూడా త్వరగా అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, సర్పంచ్ నారం రాజశేఖర్,  నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, బిర్రం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love