ఆమనగల్ ఆస్పత్రి గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

-100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయాలని 
– డీ 82 కాలువ పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలి 
నవతెలంగాణ – ఆమనగల్
ఆమనగల్ ప్రభుత్వ ఆస్పత్రిని అభివృద్ధి పర్చాలని ఎమ్మెల్యే  కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడారు. ఈసందర్భంగా నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యల గురించి ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా నాలుగు మండలాలకు ముఖ్య కూడలిగా ఉన్న ఆమనగల్ ప్రభుత్వ ఆస్పత్రిని గత ప్రభుత్వం 30 పడకల నుంచి 10 పడకలకు కుదించిందని, దీంతో రోగులకు వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. ఎన్నికలకు ముందు ఆసుపత్రిని 50 పడకలకు పెంచుతున్నట్లు హడావిడిగా జీఓ ఇచ్చిన క్షేత్ర స్థాయిలో అమలు కాలేదని ఆయన తెలిపారు. ఈప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆమనగల్ ఆసుపత్రిని 100 పడకలకు పేంచి అధునాతన భవనాన్ని నిర్మించాలని కసిరెడ్డి కోరారు. అదేవిధంగా ఆమనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణం భూవివాదం కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయిందని, భూవివాదాన్ని పరిష్కరించి భవన నిర్మాణం పనులను పూర్తి చేసి విద్యార్థుల ఇబ్బందులు తీర్చాలని, డిగ్రీ, పాల్టెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా డీ 82 కాలువ నిర్మాణానికి కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసిన అసంపూర్తి పనుల మూలంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదని అన్నారు. నియోజకవర్గంలోని వెల్దండ, ఆమనగల్, మాడ్గుల మండలాల పరిధిలో 35 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2017లో డీ 82 కాలువ నిర్మాణం చేపట్టడం జరిగిందని, కాలువ నిర్మాణానికి రూ.178 కోట్లు కేటాయించగా రూ.160 కోట్లు ఖర్చు చేసిన వెల్దండ మండలంలోని చెరుకూరు వద్ద ఓ రైతు పొలానికి పరిహారం అందిచకపోవడం వల్ల మధ్యలోనే పనులు నిలిచి పోయాయని ఆయన సభకు వివరించారు. గత ప్రభుత్వ పట్టింపు లేని ధోరణి వల్ల 82 కాలువ పనులు ప్రారంభించి ఆరేండ్లు అయిన పనులు పూర్తి కాక రైతులకు సాగునీరు అందలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. అదేవిధంగా డీ 82 కాలువ కొరకు భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులకు అందించాల్సిన రూ.40 కోట్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రస్తావించిన సమస్యలను సంబందిత శాఖల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు.
Spread the love