అధికార పార్టీలోనే ఉన్న నాకు ఈ కర్మేంటి..?: ఎమ్మెల్యే ముస్తఫా

నవతెలంగాణ – గుంటూరు
గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో రెండో రోజు అయిన శనివారం హాట్ హాట్‌గా జరిగింది. కౌన్సిల్‌లో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా తీవ్ర అసంతృప్తి ఆవేదనను వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యేగా అడిగినా లక్ష రూపాయలతో కల్వర్ట్ నిర్మాణం చేయలేదన్నారు. తాను అధికారపార్టీలో లేనా? అని ప్రశ్నించారు. తాను రికమండ్ చేస్తే పనులు చేయరా? అని ప్రశ్నించారు. ఏఈని కౌన్సిల్‌కు పిలిపించాలని.. అప్పటి వరకూ కౌన్సిల్ సమావేశాన్ని నిలిపివేయాలని ముస్తఫా డిమాండ్ చేశారు. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేనేనా..? 5వ డివిజన్‌లో లక్ష రూపాయలు వెచ్చించి కల్వర్టు నిర్మాణం చేపట్టమని అధికారులను అడిగి ఆరేడు మాసాలవుతోంది. ఇప్పటి వరకు కదలిక లేదు. ఎందుకండి ఇంకా నేను ఎమ్మెల్యేగా ఉండడం? అసలు నా పనులు చేయొద్దని మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు..? అధికార పార్టీలోనే ఉన్న నాకు ఈ కర్మేంటి..? అని శనివారం నిర్వహించిన గుంటూరు నగరపాలక కౌన్సిల్‌ సమావేశంలో ఎమ్మెల్యే ముస్తఫా అధికారుల తీరుపై మరోసారి తన ఆవేదనను వెళ్లగక్కారు. రూ.కోటి వెచ్చించి డివైడర్‌ కడతారు కానీ నేను అడిగిన రూ.లక్ష విలువైన పని చేయటానికి చేతులు రావటం లేదా? ఏం ఎలా కనిపిస్తున్నానంటూ.. మహిళా కార్పొరేటర్లు, మహిళా అధికారులు ఉన్నారనే విషయాన్ని మరిచిపోయి అసభ్య పదజాలాన్ని వాడారు. కల్వర్టు పని ఎందుకు చేయలేదో సంబంధిత ఏఈని పిలిపించి వివరణ ఇచ్చేవరకు సమావేశాన్ని ఆపేయాలని పట్టుపట్టారు. నెల రోజుల్లో ఆ పని పూర్తి చేయించే బాధ్యత తనదంటూ ఎస్‌ఈ భాస్కర్‌ తెలియజేయడంతో ఎమ్మెల్యే శాంతించారు.

Spread the love