నవతెలంగాణ- నవీపేట్
ప్రభుత్వ పాఠశాలలో అందరి సహకారంతో విద్యాభివృద్ధికి కృషి చేస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మండలంలోని నాలేశ్వర్, తుంగిని, నిజాంపూర్, బినోల, సిరన్ పల్లి, జన్నేపల్లి, నారాయణపూర్ గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో మరుగుదొడ్లు, భవనాల నిర్మాణాలతో పాటు ఉపాధ్యాయుల సహకారంతో ప్రైవేటుకు ధీటుగా విద్యాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. పేద తల్లిదండ్రులు పిల్లల చదువులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు ప్రభుత్వ బడులకు పంపిస్తారని అన్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. నూతనంగా నిర్మించిన బినోల సొసైటీ భవనాన్ని చైర్మన్ మగ్గరి హన్మాన్లుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతులకు నష్టం వచ్చే పనులు చేస్తే సహించేది లేదని రైతుల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. గత ప్రభుత్వం మోడల్ పాఠశాలలు, పాలిటెక్నిక్ పాఠశాలలను ఏ ఉద్దేశంతో ప్రారంభించిందో ఆ లక్ష్యాన్ని చేరేలా అధ్యాపకులు కృషి చేయాలని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ఎంపీడీవో, ఎమ్మార్వోల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ప్రజలను సూచించారు. గత ప్రభుత్వ నాయకులు రెవెన్యూ అధికారుల సహకారంతో అవినీతికి పాల్పడ్డారని ఇప్పుడు అలా జరుగితే కఠినంగా వ్యవహరిస్తానని అన్నారు. విండో సమస్యలను చైర్మన్లు ఆయన దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను నియంత్రించాలని అలాగే గంజాయి, డ్రగ్స్ లను ప్రోత్సహించే కార్యక్రమాలు జరిగితే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డిని ఆయా గ్రామాల నాయకులు ప్రజలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సవిత,సొసైటీ వైస్ చైర్మన్ బాబర్, డైరెక్టర్లు, ఆయ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.