– బాలికల హాస్టల్, ప్రభుత్వాసుపత్రి తనిఖీ
– మండల టాపర్లకు సన్మానం
నవతెలంగాణ-ఖానాపూర్
మండలంతో పాటు పట్టణంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సుడిగాలి పర్యటన చేశారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ల్యాబ్‌లో ఉన్న మందులను, బాలింతలకు అందించే భోజనాన్ని పరిశీలించారు. నాసిరకం భోజనం ఎందుకు పెడుతున్నారని, మెనూ ప్రకారం భోజనాన్ని ఎందుకు అందించడం లేదని అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 10వ తరగతి మండల టాపర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలన్నారు. ప్రస్తుతం ప్రయివేట్ కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. అక్కడి నుండి జెకెనగర్‌లో ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే బాలికల హాస్టల్, స్కూల్‌ను తనిఖీ చేశారు. అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు విద్యతో పాటు మంచి పౌష్టికాహారాన్ని అందజేయాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం కచ్చితంగా భోజనం పెట్టాలని పేర్కొన్నారు. అనంతరం సుర్జాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బిక్కి హనుమంతు శోభ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఇంటికెళ్లి పరామర్శించారు.