ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ హత్యకు ఎమ్మెల్సీ కుట్ర

– ఈటల జమున సంచలన ఆరోపణలు
నవతెలంగాణ -మేడ్చల్‌
ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను చంపడానికి ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి రూ.20 కోట్లు సుపారీ ఇచ్చి కుట్ర పన్నారని ఈటల రాజేందర్‌ భార్య జమున సంచలన ఆరోపణలు చేశారు. మేడ్చల్‌ మండల పరిధిలోని పూడూరు గ్రామంలోని వారి నివాసంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. చిల్లర పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీని చేసి హుజురాబాద్‌ ప్రజల మీదికి సీఎం కేసిఆర్‌ వదిలిపెట్టారని విమర్శించారు. ఈటల రాజేందర్‌కు, తమ కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితే సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డిదే బాధ్యత అని హెచ్చరించారు. కౌశిక్‌రెడ్డికి మహిళలు, బీసీ సామాజిక తరగతి మీద ఎలాంటి గౌరవం లేదన్నారు. ఎమ్మెల్సీ పదవి నుంచి కౌశిక్‌ రెడ్డిని వెంటనే భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. చెల్పుర్‌ సర్పంచ్‌ మహేందర్‌గౌడ్‌పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసి పోలీసులతో కొట్టించి.. దాన్ని వీడియో కాల్‌లో చూపించాలని ఒత్తిడి చేసిన రాక్షసుడు పాడి కౌశిక్‌ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగుల పట్ల ఆయన అసభ్యంగా ప్రవర్తిస్తూ పంచాయతీ కార్య దర్శిని యూజ్‌ లెస్‌ ఫెల్లో అని తిట్టారని తెలిపారు. రైతును సిగ్గు లేదా అని తిట్టారని, రైస్‌ మిల్లుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

Spread the love