నవతెలంగాణ హైదరాబాద్: ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభ్రదుల నియోజకవర్గానికి జూన్ 8వ తేదీలోపు ఉప ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సీఈసీ ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభ్రదుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1వ తేదీని అర్హత తేదీగా ప్రకటిస్తూ.. గ్రాడ్యుయేట్ల కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలని సూచించింది. నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తయి మూడేండ్లు నిండినవారు ఓటు వేసేందుకు అర్హులుగా పేర్కొన్నది.
ఉప ఎన్నికకు సంబంధించి శనివారం పబ్లిక్ నోటీస్ ఇవ్వాలని, జనవరి 15న పత్రికల్లో ఒకసారి, 25న మరోసారి ఎన్నికల నిబంధనలపై పత్రిక ప్రకటన ఇవ్వాలని తెలిపింది. ఫిబ్రవరి 6న ఫామ్-18 దరఖాస్తులు స్వీకరించేందుకు చివరి తేదీగా ప్రకటించింది. ఫిబ్రవరి 21న తాత్కాలిక ఎన్నికల ముసాయిదాను తయారు చేసుకోవాలని, 24 నుంచి మార్చి 14వ అభ్యంతరాలను స్వీకరించటం, ఏప్రిల్ 4 నాటికి సవరణలో కూడిన తుది ఎన్నికల ముసాయిదాను ప్రచురించాలని వెల్లడించింది.