– కాంగ్రెస్‌లో చిచ్చురేపిన ఎమ్మెల్యే సంజయ్ చేరిక
– ప్రత్యర్థి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరికపై తీవ్ర అసంతృప్తి
– కనీసం సమాచారం ఇవ్వరా? అంటూ ఆగ్రహం
– బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారంటూ ప్రచారం
– జీవన్‌రెడ్డిని సముదాయించేందుకు వెళ్లిన మంత్రి శ్రీధర్‌బాబు, సీనియర్ నేతలు
– నిరసన తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు
– మరోవైపు సంజయ్ పై బీఆర్‌ఎస్ శ్రేణుల ఆగ్రహం
– ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
నవతెలంగాణ- కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / జగిత్యాల
జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడం స్థానిక కాంగ్రెస్‌లో చిచ్చురేపింది. స్థానిక ‘హస్తం’ పార్టీ శ్రేణులు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. పార్టీ సీనియన్ నేతనైన తనకు కనీసం తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకునే విషయం కూడా చెప్పరా? అంటూ ఆగ్రహానికి గురయ్యారు. అలకబూనిన ఆయన పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఏకంగా బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం వరకూ వెళ్లింది. దీంతో పార్టీ సీనియర్ నాయకులు మంత్రి శ్రీధర్‌బాబు సహా ప్రభుత్వ విప్‌లు లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్ ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడనున్నట్టు తెలిసింది. ఏదేమైనా తన 40ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో వన్‌మ్యాన్ ఆర్మీగా ఉన్న జీవన్‌రెడ్డి ఎపిసోడ్ ఎటు మలుపు తిరుగుతుందోనన్న చర్చ సర్వత్రా నెలకొంది.
తొలి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్న జీవన్‌రెడ్డి 1983 నుంచి జగిత్యాలలొ ఓటమెరుగని నేతగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మధ్యలో 1985, 1994, 2009, 2018 ఎన్నికల్లో మాత్రమే ఓటమి చవిచూశారు. అయినప్పటికీ 2018 ఓటమి తరువాత వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రస్తుతం శాసనమండలి సభ్యునిగా కొసాగుతున్నారు. అయితే ఈయనకు తొలి నుంచి టీడీపీ పోటీగా నిలబడగా.. తరువాత 2014 నుంచి బీఆర్‌ఎస్ ప్రత్యర్థిగా ఉంటూ వచ్చింది. 2014లో గెలిచినప్పటికీ 2018లో బీఆర్‌ఎస్ చేతిలో ఓటమి తప్పలేదు. ప్రధాన ప్రత్యర్థి పార్టీగా బీఆర్‌ఎస్‌కు ఆయనే గట్టిపోటీనిస్తూ కాంగ్రెస్ క్యాడర్‌ను, పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లోనూ తన అసెంబ్లీ సెగ్మెంట్ భాగమైన నిజామాబాద్ లోక్‌సభకు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ తొలి నుంచి జగిత్యాల అంటేనే జీవన్‌రెడ్డి అన్న రీతిలో తన చరిష్మాను చాటుకుంటూ వస్తున్న ఆయనకు.. తన సెగ్మెంట్‌లో తనపై పోటీ చేసి గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని కాంగ్రెస్‌లోకి చేర్చుకుంటున్న విషయం కనీస సమాచారం లేకుండా పోయింది. దీంతో జీవన్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అలకబూనడం, ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి పరిణామాలు తెలిసిందే.
పార్టీకి రాజీనామా.. బీజేపీలో చేరుతారనే ప్రచారం…
ఇన్నాళ్లూ పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడ్డ తనకు ప్రత్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్ ని కాంగ్రెస్‌లో చేర్చుకునే విషయాన్ని చెప్పకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తికి గురైన జీవన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం నడిచింది. అందులోనూ సంజరు చేరికకు ముందు రోజే పార్టీ ఫిరాయింపులపై జీవన్‌రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. ‘ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో 65 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంది. ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదు. ఇలాంటి వాటిని నేను వ్యక్తిగతంగా ప్రోత్సహించను’ అంటూ మాట్లాడారు. ఆ మర్నాడు ఆదివారం సాయంత్రమే తన ప్రత్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజరుని సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నారు. ఆ ఫొటోలు, వార్తలు వచ్చేవరకూ జవన్‌రెడ్డికి సమాచారం లేని అనూహ్య పరిణామంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన అనుచరుల ఫోన్లూ ఎత్తకుండా అలకబూని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సంజరు చేరికపై ఆయన అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులకూ అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి జీవన్‌రెడ్డి రాజీనామా చేయనున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. కాగా, బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం మొదలైంది. అందుకు జీవన్‌రెడ్డిని కరీంనగర్, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీలు బండి సంజరు, ఈటల రాజేందర్ కలుస్తారని వార్తలు షికారు చేశాయి. జీవన్‌రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించే అవకాశం ఉందని జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఈ వార్తలపై జీవన్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించకపోవడం అందుకు బలం చేకూర్చింది.
బుజ్జగించే పనిలో సీనియర్ నేతలు
ప్రభుత్వ విప్‌లు.. ధర్మపురి, వేములవాడ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్ సోమవారం ఉదయమే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసే క్రమంలో అప్పటికే కాంగ్రెస్ శ్రేణులు, జీవన్‌రెడ్డి క్యాడర్ పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. పరిస్థితి చేజారుతుందనగా.. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సైతం సాయంత్రం జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఆయననూ పార్టీ క్యాడర్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఆయన జీవన్‌రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఫోన్‌లో జీవన్‌రెడ్డితో మాట్లాడనున్నట్టు తెలిసింది. ఏదేమైనా ఈ ఎపిసోడ్ మొత్తంలో జీవన్‌రెడ్డి అలకవీడుతారా? లేక పార్టీ మారుతారా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరోవైపు తల్లిలాంటి పార్టీని మోసం చేశారంటూ ఎమ్మెల్యే సంజరుపై బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మలు దహనం చేశారు.