నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈటల దంపతులు మాట్లాడినవన్నీ అబద్ధాలేనని రాష్ట్ర ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ఎల్పీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటల దంపతుల వ్యాఖ్యలను ఖండించారు. రోడ్డు విస్తరణలో భాగంగా హుజూరాబాద్‌లోని అమరవీరుల స్థూపాన్ని కూల్చాలని మున్సిపాల్టీ తీర్మానించిందనీ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా దాన్ని ఆమోదించారని తెలిపారు. ఆ స్థూపానికి శిలాఫలకమే లేదనీ, దానిపై ఈటల పేరుండే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. రూ.20 కోట్లు ఖర్చు చేసి తాను ఈటలను హత్య చేసేందుకు ప్లాన్ చేశానని ఆరోపించడం నిరాధారమని తెలిపారు. ఉద్యమకారుడు బాలరాజును హత్య చేయించింది, ప్రవీణ్ కుమార్‌ను పోలీసులతో హింసించి గుండెపోటుతో చనిపోయేలా చేసింది కూడా ఈటల కాదా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే ఈటల తనను అంతమొందించేందుకుకుట్ర పన్నారని కౌశిక్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
ముదిరాజ్‌లంటే ఎందుకంత చిన్నచూపు?
ఈటల సతీమణి ముదిరాజ్‌లను ఉద్దేశించి, చిన్నకులంగా సంబోధించి అవమానించిందని కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిరాజ్‌లంటే చిన్నచూపు ఉన్నందుకే ఆమె తన కోడలు, అల్లుడిని ముదిరాజ్ నుంచి కాకుండా ఇతర కులాల నుంచి తెచ్చుకున్నారని విమర్శించారు. ఒకప్పుడు ఇల్లు సరిగా లేని ఈటల రాజేందర్‌కు వందల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆయన్ను ఓడించేంత వరకు విశ్రమించేది లేదని తెలిపారు.