ఉత్తరా నారాయణన్. చిన్నతనం నుండి ఆమె పెరిగిన వాతావరణం చుట్టూ ఉన్న సమస్యలను గుర్తించేలా చేసింది. ఆర్థిక అక్షరాస్యత, వాతావరణపై అవగాహన మహిళలకు చాలా అవసరమని గ్రహించారు. వీటిపై వారికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు బజ్ ఉమెన్ పేరుతో ఓ మొబైల్ అకాడమీ స్థాపించారు. దీని ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలకు ఆర్థిక అవగాహన, ఆరోగ్యం, పరిశుభ్రతతో పాటు నాయకత్వంలో శిక్షణనిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
కర్నాటకలోని కోలార్ జిల్లాలోని కడారిపుర గ్రామానికి చెందిన కాంతలక్ష్మి, కలుషితమైన మాంసం తినడం వల్ల కాలేయ ఇన్ఫెక్షన్ అయ్యి ఆమెకు గర్భస్రావం జరిగింది. దీంతో ఆమె గుండె పగిలిపోయింది. నాణ్యమైన ఆహారాన్ని కోసం చేయాల్సిన పోరాటంలో ఆమె ఒంటరిగా లేదని తక్కువ కాలంలోనే ఆమె గ్రహించింది. బజ్ ఉమెన్ అనే ఎన్జీవో నిర్వహించే బజ్ గ్రీన్ ప్రోగ్రామ్ ద్వారా దేశీ పౌల్ట్రీ, ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రయోజనాలు తెలుసుకుంది. దీని ద్వారా హానికరమైన రసాయ నాలు లేని గుడ్లు, మాంసం, ఇతర పంటలను ఉత్పత్తి చేయవచ్చు. దేశీ పౌల్ట్రీలో గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయకంగా పెంచే కోళ్లు అందుబాటులో ఉంటాయి. వీటి మాంసం, గుడ్లు హైబ్రిడ్ జాతుల కంటే ఎక్కువ రుచిగా ఉంటాయి.
తన వంతు కృషి
కాంతలక్ష్మి అందులో శిక్షణ తీసుకొని గతేడాది మేలో రూ.50 వేలు అప్పు చేసి ముప్పై కోళ్లు, నాలుగు మేకలు, రెండు ఆవులు, ఒక గేదెతో ఫారం ప్రారంభించింది. అలాగే బెండకాయ, ఆలూ, ఉల్లిగడ్డ, బీన్స్, మునగకాయలతో కిచెన్ గార్డెన్‌ను కూడా ప్రారంభించింది. సొంతంగా కూరగాయలు పండించడం వల్ల చాలా డబ్బు ఆదా అయ్యింది. పౌల్ట్రీ ఉత్పత్తులను అమ్ముతూ మరింత ఆదాయాన్ని పొందింది. ఇలా సేంద్రీయ వ్యవసాయ పద్ధతులతో ప్రజలకు పోషకమైన, సురక్షితమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచింది. పర్యావరణం, సమాజం కోసం తన వంతు కృషి చేస్తోంది. వీటితో పాటు తన ఇంటి చుట్టూ మామిడి, బెల్ పత్ర, జామున్‌తో సహా వివిధ చెట్లను కూడా నాటింది. ఇంట్లో నీటి రీసైక్లింగ్ పద్ధతులను కూడా చేపట్టింది. బజ్ ఉమెన్‌తో కలిసి పని చేస్తున్న ఆరు లక్షల మంది మహిళల్లో కాంతలక్ష్మి ఒకరు.
శక్తివంతం చేసుకునేలా…
భారతదేశంలో మైక్రో-క్రెడిట్ బ్యాంక్ వ్యవస్థాపకుడు సురేష్ కృష్ణ సహాయంతో 2012లో ఉత్తరా నారాయణన్, డేవ్ జోంగెనెలెన్ దీన్ని ప్రారంభించారు. ఇది గ్రామీణ మహిళలకు ఆర్థిక, వాతావరణ మార్పు, వ్యవస్థాపకత, నాయకత్వంలో అవసరమైన శిక్షణను ఇంటి వద్దనే అందించే మొబైల్ అకాడమీ. ‘లింగ పక్షపాతం, విశ్వాసం లేకపోవడం మహిళలను ఆర్థిక స్వాతంత్య్రం లేనివారిగా చేస్తోంది. అందుకే మేము మహిళల్లో విశ్వాసాన్ని నింపి, ఆర్థికంగా నిలబెట్టడం, దాని ద్వారా పర్యావరణం కోసం కృషి చేయడంలో శిక్షణ ఇస్తున్నాం. మహిళలకు మేము ఎలాంటి సాధికారతా కల్పించం. వారే తమను తాము శక్తివంతం చేసుకునేలా సహకరిస్తున్నాం’ అంటూ ఉత్తర పంచుకున్నారు.
చిన్ననాటి అన్వేషణ
ఉత్తర చిన్నతనం నుండి ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. టీవీలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టేటపుడు తన తండ్రి ఇంటి బడ్జెట్‌ను ఆమెకు వివరించేవారు. తనకేమైన అవసరాలు ఉంటే చెప్పమని అడిగేవారు. తన తండ్రి బ్యాంకర్ల యూనియన్‌లో భాగమై ఉన్నందున తన తల్లి పొరుగువారికి అవసరమైన సహాయం చేస్తుండేది. వీరి ప్రభావంతోనే కాస్ట్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉత్తర జనగ్రహ అనే ఎన్జీవోలో చేరారు. ఆడపిల్లగా తాను సమాన అవకాశాల మధ్య పెరిగినా చుట్టూ ఉన్న సమాజం అలా లేదని ఆమె గ్రహిం చింది. తన తల్లి కూడా చిన్నతనంలో ఇలాంటి వివక్షను ఎదుర్కొందని తెలుసుకుంది. ‘అందుకే నేను ఎక్కువ మంది మహిళలకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నాను’ ఆమె పంచుకున్నారు. 2011లో మహిళల సమస్యలపై అవగాహన కోసం కర్ణాటకలోని ఓ గ్రామాన్ని సందర్శించారు. అప్పుల భారంతో ఆ మహిళలు చాలా కష్టపడుతున్నారు. అందుకే ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తన బడ్జెట్ నైపుణ్యాలను ఉపయోగించారు. ఈ ఆలోచనే చివరికి 2012లో బజ్ ఉమెన్ పుట్టుకకు దారితీసింది.
అంగన్‌వాడీల సహకారంతో…
బజ్ పని స్వీయ శక్తి శిక్షణతో ప్రారంభమవుతుంది. మొబైల్ బస్సులు కర్ణాటకలోని మారుమూల గ్రామాలకు వెళ్లి రెండున్నర రోజుల పాటు శిక్షణా సెషన్‌లను నిర్వహిస్తాయి. సెషన్ల మధ్య వారం గ్యాప్ ఉంటుంది. ఈ సెషన్‌లు బడ్జెట్, రుణాలు, వడ్డీతో సహా ఆర్థిక అక్షరాస్యతలోని ప్రాథమిక అంశాలపై దృష్టి సారిస్తాయి. వాతావరణ మార్పులను కూడా స్పృశిస్తారు, వారిలో విశ్వాసాన్ని పెంచుతారు. బజ్ మహిళలు అంగన్‌వాడీ వర్కర్ల సహాయాన్ని తీసుకుంటారు. ప్రారంభంలో శిక్షణ పొందిన మొదటి 300 మంది మహిళలతో ఉత్తర వ్యక్తిగతంగా మాట్లాడేవారు. అయితే సంఖ్య పెరగడంతో ఇది సవాలుగా మారింది. దీన్ని పరిష్కరించడానికి బజ్ ఉమెన్ ప్రతి బ్యాచ్ నుండి ఒక మహిళను యాంకర్ ఉమెన్ లేదా ‘గెలాతి’గా గుర్తించి నామినేట్ చేస్తుంది. ఈ యాంకర్ తన శిక్షణా బృందంతో నెలవారీ లెర్నింగ్ సెషన్‌లను నిర్వహిస్తుంది. కుటుంబ ఆదాయాన్ని నిర్వహిం చడం, వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడం, పరిష్కరించడం, మానసిక ఆరోగ్యం, పరిశుభ్రత, సోదరభావాన్ని నిర్మించడం, వారి నైపుణ్యాలపై నమ్మకాన్ని పెంచుకోవడం వీరి ముఖ్య ఉద్దేశం.
ఇతర దేశాల్లోనూ…
బజ్ ఉమెన్ ప్రస్తుతం కర్ణాటకలోని 11 జిల్లాల్లో సుమారు 18,000 గ్రామాలతో పని చేస్తోంది. భారతదేశంలో 10,000 జిలాథిలను, 118 మంది శిక్షణ పొందిన ఫీల్డ్ అసోసియేట్‌లను కలిగి ఉంది. వారు దాదాపు ప్రతి నెల మూడో వారంలో గ్రామాలను సందర్శిస్తారు. ప్రతి నెలా గెలాథిలను కలుస్తారు. ప్రతి ఫీల్డ్ అసోసియేట్ దాదాపు 100 గ్రామాలకు అనుబంధంగా ఉంటుంది. ఈ సంస్థ గాంబియా, జార్జియా, టాంజానియా, ఉక్రెయిన్ దేశాల్లోని గ్రామీణ సంఘాలకు కూడా సహాయం చేస్తోంది. దీని కోసం సిటీ బ్యాంక్, ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి సంస్థల నుండి నిధులను అందుకుంటుంది.
కుటుంబంతో పోరాడి
కర్ణాటకలోని పెరేసంద్ర గ్రామానికి చెందిన అమ్మాజాన్ ఇంజనీరింగ్ చదవాలనుకుంది. అయితే ఆమెకు 2018లో పెండ్లి చేసేశారు. దాంతో ఇంజనీరింగ్ పూర్తి చేయలేకపోయింది. ఏడాది తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కొంతకాలానికి తన గ్రామంలో బజ్ ఉమెన్ శిక్షణ గురించి తెలిసింది. మొదటి సెషన్ ఆమెను ఎంతగానో ప్రేరేపిం చింది. తన చదువు కొనసాగించడం గురించి అత్తమామలతో మాట్లాడాలనుకుంది. కుటుంబంతో పోరాడి చివరకు డిగ్రీ పూర్తి చేసింది. అయితే ఇది ఆమె కుటుంబ సభ్యులకు మింగుడు పడలేదు. విడాకుల తీసుకొని బెంగ ళూరు వెళ్లిపోయింది. ఆమె ఇప్పు డు నగరంలోని ఓ ఏరోస్పేస్ కంపెనీ లో క్వాలిటీ ఇంజనీర్‌గా పనిచేస్తుంది.
నేను నమ్మకంగా ఉన్నాను
గెలాతిగా కూడా ఉన్న అమ్మాజాన్ గ్రామం పట్ల తన బాధ్యతలపై రాజీపడదు. మహిళలందరూ కలిసి తమ సమస్యలపై చర్చించేందుకు, బాల్య వివాహాలు, కుటుంబ నియంత్రణ, రుతుక్రమ పరిశుభ్రత మొదలైన వాటిపై అవగాహన కల్పించాలని ఆమె కోరుకుంటుంది ‘ఈ రోజు నేను నమ్మకంగా ఉన్నాను. బజ్ మహిళలు నా కోసం నిలబడటం వల్లనే ఇది సాధ్యం. ఇతర మహిళలకు మెరుగైన భవిష్యత్తు కోసం మద్దతు ఇవ్వడానికి వారు నన్ను ప్రేరేపించారు’ అని ఆమె పంచుకుంది.
సవాళ్లు, ముందున్న మార్గాలు
ఉత్తరకు మొదట్లో కన్నడ మాట్లాడటం రాదు. దాంతో మహిళలతో కనెక్ట్ అవ్వడం సవాలుగా మారింది. భాషా అవరోధం ఉన్నప్పటికీ నిజాయితీగా సహనంతో పని చేశారు. ఆరు నెలల్లోనే కన్నడ నేర్చుకుని మహిళలతో బలమైన నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. మొదట్లో మహిళలను సమీకరించడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి సహాయం అందిన తర్వాత పరిస్థితి మెరుగుపడింది. ఇన్ని సవాళ్లు ఎదురైనా ఉత్తర సంకల్పం ఎప్పుడూ వమ్ము కాలేదు. ‘నేను దీన్ని చేయడానికి ఎంపిక చేసుకున్నాను, నా సోదరీమణుల కోసం నిలబడతాను’ అంటూ నమ్మకంతో చెబుతున్నారు. కమ్యూనిటీ యాంకర్‌లు గ్రామాలలోని అన్ని ప్రోగ్రామ్‌లకు నాయకత్వం వహించేలా తీర్చిదిద్దాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు. దీని ద్వారా మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.