– బలపర్చిన చంద్రబాబు, నితీశ్
– ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన రాష్ట్రపతి
– మూడోసారి ప్రధానిగా ఆదివారం ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి చెందిన పలు పార్టీల ఎంపీలు మోడీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు రాజ్‌నాథ్‌సింగ్.. మోడీ పేరును ప్రతిపాదించారు. ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తూ ఎన్డీఏ ఎంపీలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీంతో ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయటానికి ఆయనకు మార్గం సుగమమైంది. ఈ సమావేశానికి ఎన్డీఏలోని పలు పార్టీల అధినేతలు, ముఖ్యనాయకులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఎన్డీఏ ఎంపీల సమావేశానికి ముందు బీజేపీ సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ఆదివారం నాడు ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేస్తాడని స్పష్టం చేశారు. ఈ నెల 9న సాయంత్రం ఆరు గంటలకు మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో మోడీ నాయకత్వాన్ని సమర్ధించటానికి సమావేశమైన ఎన్డీఏ నేతలతో ప్రహ్లాద్ జోషి అన్నారు.
ఎన్డీఏ భేటీలో పొగడ్తలే…
నరేంద్ర మోడీ నాయకత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. భారత్‌కు సరైన సమయంలో సరైన నాయకుడు దొరికారని, ఆయన మోడీ అని చంద్రబాబు పొగిడారు. మోడీకి విజన్, ఉత్సాహం ఉన్నాయన్నారు. పరిపూర్ణ కార్యదక్షత కలిగిన నాయకుడని అన్నారు.
దేశానికి మోడీ ఒక స్ఫూర్తి: పవన్ కల్యాణ్
ఎన్డీఏ నేతగా మోడీ పేరును బలపరుస్తూ మాట్లాడిన పవన్ కల్యాణ్ ఆయనపై ప్రశంసల జల్లు కురింపించారు. దేశానికి మోడీని ఒక స్ఫూర్తిగా అభివర్ణించారు. ఆ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత విజయం సాధించామన్నారు. ఆయన దిశానిర్దేశంతో ఏపీలో 91 శాతం పైగా సీట్లు సాధించామని తెలిపారు. మోడీ వెనుక తామంతా ఉన్నామని ప్రకటించారు. ఎన్డీఏ పక్ష నేతగా మోడీకి వారి పూర్తి మద్దతు ఉంటుందన్నారు
మోడీ కూడా పోటీపడి..
ప్రధాని మోడీ మాట్లాడుతూ లక్షలాది మంది కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడటంతో ఎన్డీఏ కూటమి మెజార్టీ సాధించిందని ప్రధాని మోడీ అన్నారు. కూటమికి మద్దతు తెలిపిన పార్టీలు, అధినేతలు, ఎంపీలకు మోడీ ధన్యవాదాలు తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మోడీ ప్రశంసలు కురిపించారు. ”ఇక్కడ కూర్చున్నాడు చూడండి.. ఈయన పవన్ కల్యాణ్ కాదు, తుఫాన్” అని సంబోధించారు. దానికి పవన్ కల్యాణ్ ఉబ్బితబ్బి బ్బైపోయారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు అఖండ విజయం అందజేశారని గుర్తుచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో కలిసి పవన్ కల్యాణ్ చారిత్రాత్మక విజయం సాధించారని అన్నారు.
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా..
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మోడీ పేరును సీనియర్ బీజేపీ నాయకుడు రాథ్నాథ్సింగ్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు బీజేపీ నాయకులతో పాటు ఎన్డీఏ నేతలు మద్దతు పలికారు. లోక్‌సభలో బీజేపీ నాయకుడిగా, ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ, బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా.. ఇలా మూడు ప్రతిపాదనలకు మోడీ పేరును రాజ్‌నాథ్ సింగ్ సిఫారసు చేశారు. మద్దతు తెలిపిన బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా, నితిన్ గడ్కరీ వంటి సీనియర్ నాయకులు, ఎన్డీఏ ఇతర సీనియర్ నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, హెచ్డి కుమారస్వామి (జేడీఎస్, కర్నాటక), బీహార్ సీఎం, జేడీ(యూ) చీఫ్ నితీశ్ కుమార్‌లు ఉన్నారు. దీంతో భారతదేశ మూడో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయటానికి మోడీకి మార్గం సుగమమైంది. దీనితో పాటు మోడీని కూటమి అధినేతగా ప్రతిపాదిస్తూ బీజేపీ అధ్యక్షుడు జె.పి నడ్డా చేసే తీర్మానాన్ని ఆమోదించటం కోసం ఎన్డీఏ ఎంపీలతో పాటు కూటమిలోని ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. కాగా, కూటమి నేతగా తనను ఎన్నుకోవటంతో మద్దతిస్తున్న ఎంపీల జాబితాను మోడీ.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి సమర్పించారు. కూటమి నేతలతో కలిసి శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆయన.. ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం, మోడీ మీడియాతో మాట్లాడారు.